నిర్వీర్యం చేసిన వైరస్‌తో టీకా!

18 Apr, 2020 01:57 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమవుతున్న సీసీఎంబీ

తయారీ సులువు, సురక్షితం కూడా 

తగిన వైరస్‌ను ఎంపిక చేసేందుకే రెండు, మూడు నెలలు 

ఏడాది సమయం పడుతుంది 

సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు టీకా తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌నే టీకాగా అభివృద్ధి చేస్తుండటం విశేషం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలో టీకా మన ముందుకు వస్తుందని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సురక్షితమైన, సులువుగా తయారు చేసేందుకు వీలైన పద్ధతిలో తాము టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ అని పిలిచే ఈ తరహా టీకాల తయారీ మానవ కణంలో వైరస్‌ సంతతిని గణనీయంగా పెంచడం ద్వారా మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను లేదా వేడిని ఉపయోగించడం ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తారు. వైరస్‌ నిర్వీర్యమైనా, పునరుత్పత్తి సామర్థ్యం లేకపోయినా.. అందులోని ప్రొటీన్‌ కొమ్ము లాంటి భాగాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి.

ఈ కొమ్ము సాయంతోనే వైరస్‌ కణాల్లోకి ప్రవేశిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. అయితే నిర్వీర్యమైన వైరస్‌ మన కణంలోకి ప్రవేశిస్తే.. రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తిస్తుంది. తదనుగుణంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. వైరస్‌ ఎలాగూ నిర్వీర్యమైంది కాబట్టి దాని ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇంకోలా చెప్పాలంటే.. ఈ టీకాను వాడటం సురక్షితమన్నమాట. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు కూడా దీన్ని ఉపయోగించొచ్చు. సీసీఎంబీలో ప్రస్తుతం తాము ఈ ఇనాక్టివేటెడ్‌ టీకా తయారీకి సిద్ధమవుతున్నామని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. నిర్వీర్యమైన వైరస్‌లను చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి చేసి ఇంజెక్షన్‌ రూపంలో శరీరంలోకి ప్రవేశపెట్టాలన్నది తమ ఆలోచన అని వివరించారు. 

బయట పెంచడమే సవాల్‌.. 
వైరస్‌లన్నీ పరాన్న జీవులని తెలిసిన విషయమే. వీటికి స్వయంగా జీవం ఉండదు. కాకపోతే ఇతర జంతువుల కణాల్లోకి చొరబడి.. వాటి జన్యుపదార్థాన్ని హైజాక్‌ చేయడం ద్వారా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు టీకా తయారీలో అతిపెద్ద సవాలు కూడా ఇదే. శరీరం బయట ఈ వైరస్‌లను పెంచాల్సి ఉంటుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించేందుకు ఆఫ్రికాకు చెందిన కోతుల చర్మపు పై పొరలోని కణాలను వైరస్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. నిర్వీర్యమైన వైరస్‌లో అవసరమైన ప్రొటీన్లు అన్నీ ఉన్న వాటిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత వేర్వేరు దశల్లో జంతు, మానవ ప్రయోగాలు చేపట్టేందుకు, మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని రాకేశ్‌ మిశ్రా వివరించారు. వైరస్‌ను పెంచేందుకు తగిన పద్ధతిని కనుక్కోవడం భవిష్యత్తులో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీకి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకసారి వైరస్‌ను కణంలోకి ప్రవేశపెడితే రెండు, మూడు రోజుల తర్వాత కణాలు చనిపోగా.. వైరస్‌లు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయని.. మందుగా పనిచేస్తాయనుకున్న వాటిని నేరుగా ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని లెక్కకట్టవచ్చని తెలిపారు.  

నాలుగు రకాల టీకాలు.. 
వ్యాధుల నివారణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు పద్ధతుల్లో తయారు చేస్తారు. బ్యాక్టీరియా, వైరస్‌ వంటి వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం టీకా ప్రధాన ఉద్దేశం. తద్వారా బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చన్నమాట. శాస్త్రవేత్తలు టీకాలను తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియా/వైరస్‌లకు రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది.. ఎవరికి టీకా అవసరం.. టీకా తయారీకి మేలైన పద్ధతి, టెక్నాలజీ ఏది అన్న అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా నాలుగు రకాల టీకాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటారు. 

బలహీనమైన వైరస్‌లతో.. 
ఈ రకమైన టీకాను లైవ్‌ అటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌ అని పిలుస్తారు. ఇందులో వైరస్‌కు విరుగుడుగా బలహీనమైన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ రకమైన టీకాలోని వైరస్‌లు బలహీనంగా ఉంటాయి గానీ.. వీటికి కూడా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఒకట్రెండు డోసుల టీకాతోనే జీవితాంతం నిర్దిష్ట వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఈ రకమైన టీకాలు అందరికీ అనుకూలంగా ఉండవు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు ఈ రకమైన టీకాలు వేయించుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలు. బలహీనమైన వైరస్‌లతో కూడిన టీకాలను ఎప్పుడూ చల్లగా ఉంచాల్సి ఉంటుంది. మశూచి, స్మాల్‌పాక్స్, చికెన్‌ పాక్స్‌ వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఇచ్చే టీకాలు ఈ లైవ్‌ అటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌లకు ఉదాహరణలు.  

సూక్ష్మజీవి భాగాలతో చేస్తే.. 
వ్యాధి కారక సూక్ష్మజీవి భాగాలను ఉపయోగించుకుని కూడా టీకా తయారు చేయొచ్చు. ప్రొటీన్లు, చక్కెరలు, సూక్ష్మజీవి చుట్టూ ఉండే తొడుగు వంటివి టీకా తయారీకి వాడతారు. వాడే భాగాన్ని బట్టి వీటిని సబ్‌యూనిట్‌/ రీకాంబినెంట్‌/పాలిశాకరైడ్‌/ కంజుగేట్‌ వ్యాక్సిన్లుగా పిలుస్తారు. విడిభాగం ఒక్కదాన్నేవాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందన బలంగా ఉంటుంది. అవసరమైన వారందరికీ ఇచ్చేందుకు వీలైన టీకా ఇది. అయితే వ్యాధి నుంచి రక్షణ కావాలంటే.. తరచూ బూస్టర్‌ షాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్‌–బి, షింగిల్స్, మెనింజో కోకల్, న్యూమోకోకల్, హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకాలన్నీ ఇలా బ్యాక్టీరియా/వైరస్‌ విడిభాగాలతో తయారవుతాయి.  

విషాన్ని విరుగుడుగా ఇస్తే.. 
సూక్ష్మజీవులకు పడని విషాన్ని ఉపయోగించడం ద్వారా తయారయ్యే టీకాను టాక్సాయిడ్‌ వ్యాక్సిన్‌ అని పిలుస్తారు. ఇవి తీసుకున్నప్పుడు సూక్ష్మజీవి మొత్తానికి రోగ నిరోధక వ్యవస్థ స్పందించదు. వాడిన టాక్సిన్‌ (విషం) ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే స్పందిస్తుంది. టాక్సాయిడ్‌ టీకాలు కూడా తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకట్రెండు డోసులతో జీవితాంతం రక్షణ లభించదు. టెటానస్, డిప్తీరియా వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఉపయోగించేవి టాక్సాయిడ్‌ వ్యాక్సిన్లకు ఉదాహరణలు.    

నిర్వీర్యమైన సూక్ష్మజీవులతో.. 
ఈ రకమైన టీకాలను ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్స్‌ అని పిలుస్తారు. వ్యాధి కారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేసిన తర్వాత వాడతారన్నమాట. లైవ్‌ అటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్లతో పోలిస్తే అంత ప్రభావం చూపవు. ఎక్కువ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మజీవి నిర్వీర్యమైనా.. అవి శరీరంలో ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి ప్రతిచర్యలు తీసుకుంటుంది కాబట్టి.. నిర్దిష్ట వ్యాధి సోకదన్నది ఈ టీకా వెనుక ఉన్న సూత్రం. పోలియో, రేబిస్, హెపటైటిస్‌–ఏ వంటి వ్యాధుల నివారణకు ఇచ్చే టీకాలు ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్లు!

మరిన్ని వార్తలు