సీసీఎంబీ ప్రాజెక్టుపై నీలి నీడలు

24 Feb, 2019 04:43 IST|Sakshi

రూ.1,200 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం 

స్థలం కేటాయింపులో జాప్యం వల్ల ఆలస్యం 

180 ఎకరాల్లో సీసీఎంబీ ఏర్పాటుకు 11వ ప్రణాళిక కాలంలో అనుమతి

సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైనా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ సంబంధిత కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సీసీఎంబీ కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైంది. 

దీంతో బీబీనగర్‌ పక్కనే గల రంగాపురంలోని 180 ఎకరాల్లో సీసీఎంబీని ఏర్పాటు చేయడానికి 11వ ప్రణాళిక కాలంలో కేంద్రం అనుమతినిచ్చింది. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. ఈ నిధులకు జాతీయ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఆమోదం కూడా లభించింది. అయితే స్థలం విషయంలో ఏర్పడిన వివాదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద మరో స్థలాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా, కలెక్టర్‌ అనితారామచంద్రన్, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. 

ప్రాజెక్టు స్వరూపం... 
180 ఎకరాల స్థలం, రూ.1,200 కోట్ల వ్యయం.. మానవ మూలకణాలతోపాటు పలు అంశాలపై నిరంతర పరిశోధనలు చేసే అవకాశం.. వందలాది మందికి ఉపాధి కల్పన.. ఇదీ సీసీఎంబీ పరిశోధన కేంద్రం స్వరూపం. అయితే స్థలాన్ని ఎంపిక చేయడంలో జరిగిన జాప్యం వల్ల మొత్తం నిధుల్లో రూ. 300 కోట్లను పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి మళ్లించారు.  

సీసీఎంబీలో ఏం చేస్తారంటే.. 
మానవుల మూల కణాలపై పరిశోధనలు చేస్తారు. మనుషుల్లో వచ్చే రుగ్మతలు, ప్రధానంగా కేన్సర్‌ వ్యాధి గురించి ముందే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల కోసమే సీసీఎంబీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. తార్నాకలోని ప్రాజెక్టు కేంద్ర కార్యాలయానికి చేరువలో ఉండటం, జాతీయ రహదారి 163తో పాటు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు