‘అదృశ్య వినియోగదారులు’ ఎవరు?

21 Dec, 2016 03:36 IST|Sakshi
‘అదృశ్య వినియోగదారులు’ ఎవరు?

‘ముసద్దీలాల్‌’కేసులో సీసీఎస్‌ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన గత నెల 8 రాత్రి రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేసిన ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారాన్ని నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల అరెస్టుపై హైకోర్టు స్టే విధించడంతో విచారణకు సహకరించాల్సిందిగా కోరుతూ ప్రశ్నావళి జారీ చేశారు. దీన్ని నిందితులకు పంపిన అధికారులు వారి నుంచి వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 14 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ ఠాణాలో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు సంస్థలూ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.  నోట్ల రద్దు నేపథ్యంలో ‘అనుమానాస్పదంగా’ భారీ వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించి ఫిర్యాదు చేశారు. రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిన్ గుప్తా, సీరా మల్లేశ్, నరేంద్ర జిగెల్లబోయిన, వినూత బొల్ల నిందితులుగా ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన నవంబర్‌ 8 అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 3 గంటల వ్యవధిలో ఈ సంస్థలు రూ.100 కోట్ల వ్యాపారం చేసినట్లు రికార్డులు రూపొందించాయి. ఈ వ్యవధిలో ఐదు వేల మందికిపైగా వినియోగదారులు ఒక్కొక్కరూ రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నట్లు బిల్లుల్లో చూపించింది.

ఈ సమయంలో అంతమంది వినియోగదారులు రావడమనేది ఒక ఎత్తయితే.. అందరూ ఒకే మొత్తంలో పసిడి ఖరీదు చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారు లు ఈ దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఆ రోజు, ఆ  సమయంలో ఈ షాపులకు ఎవరూ వచ్చినట్లు వాటిలో కనిపించలేదు. దీంతో ఆ ‘అదృశ్య వినియోగదారులు’ఎవరనే అంశానికి దర్యాప్తు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డులన్నీ సేకరించాలని సీసీఎస్‌ అధికారులు నిర్ణయించారు. భారీ మొత్తంతో ముడిపడిన కేసు కావడంతో దీనిపై ఆదాయపన్ను శాఖ,  ఈడీ సైతం సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు