చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’

11 Apr, 2014 04:37 IST|Sakshi
చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’
  •     అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని వెల్లడి
  •      తన వద్ద చిల్లిగవ్వలేదని పోలీసుల విచార ణలో ఏకరవు
  •  సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో పట్టుబడిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి (46)ని సీసీఎస్ పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. ఓ రహాస్య ప్రదేశంలో సీసీఎస్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆమెను విచారిస్తున్నారు.  విజయరాణి రూ.10 కోట్లకుపైగా చిట్టీలు, అధిక వడ్డీల పేరుపై  డబ్బులు వసూలు చేసుకొని పారిపోయిందని బాధితుల కథనం ప్రకా రం నిన్నటి వరకూ అనుకున్నారు.

    అయితే విచారణలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు తాను ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వాల్సి లేదని,  అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో ఏకరువు పెట్టినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులంటున్నారు.

    అసలు ఈ ఉదంతంలో వడ్డీల పేరుతో ఆమెకు ఎంత మంది ఎంత డబ్బు ఇచ్చారు..? ఆమె వద్ద చిట్టీలు  ఎవరు ఎత్తుకున్నారు..? ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎందరు?.. చిట్టీలు ఎత్తుకుని డబ్బులు కట్టని వారు ఎంత మంది?... ఇలా బాధితుల నుంచి వేర్వేరుగా వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే  డబ్బు ఎవరి వద్ద ఉంది అనే అంశం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. వియజరాణి వద్ద నిజంగా డబ్బు లేదా? ఉండే  నాటకం ఆడుతుందా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయరాణి ఎదుటే బాధితులను కూర్చోబెట్టి ప్రశ్నించాలని పోలీసులనుకుంటున్నారు. నగరంలోని ఆమె రెండు ఇళ్లతో పాటు గుడివాడలోని ఇల్లును కూడా విక్రయించిందని తేలింది.

    విక్రయించగా వచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? ఎవరికిచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వడ్డీల రూపంలో ఆమె నుంచి ఎవరెవరు ఎంత పెద్దమొత్తం తీసుకున్నారు అనే వివరాలపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. అధిక వడ్డీలు ఇవ్వడం వల్లనే ఆమె నష్టపోయిందా అనేది సందేహం కలిగిస్తోంది.  గతనెలలో నమోదైన కుట్ర, మోసం కేసులో విజయరాణితో పాటు ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

    ఇక ఆమె ఇళ్లను ఖరీదు చేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వీరు ఆమెకు నగదు ఇచ్చి ఇళ్లు ఖరీదు చేశారా? లేక వారికి డబ్బులు బాకీ ఉంటే ఇళ్లను కబ్జా చేశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆమె విక్రయించిన మూడిళ్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు పారిపోయిన విజయరాణి బృందం అక్కడ కూడా నాలుగు ఇల్లు మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి రోజు సెల్‌నెంబర్లను మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది.
     

మరిన్ని వార్తలు