హీరా కేసులో సుప్రీంకు సీసీఎస్‌! 

4 Feb, 2020 02:59 IST|Sakshi

కేసులు ఎస్‌ఎఫ్‌ఐవోకు అప్పగించాలన్న హైకోర్టు తీర్పుపై పిటిషన్‌ 

అనుమతి మంజూరు చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నింటి నీ సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కు (ఎస్‌ఎఫ్‌ఐఓ) అప్పగించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అనుమతి మంజూరు చేయడంతో సీసీఎస్‌ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొన్ని చిన్నచిన్న వ్యాపారాలు చేసిన నౌహీరా షేక్‌ 2010–11లో హీరా ఇస్లామిక్‌ బిజినెస్‌ గ్రూప్‌ పేరుతో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరా నే నేతృత్వం వహిస్తున్నారు.

తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్‌ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమరి్పంచలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు అనేక మార్గాల్లో సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా లేవు. 

సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌... 
హీరా గ్రూప్‌ భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు తేల్చారు. ఈ గ్రూప్‌పై మొత్తం 8 కేసులు నమోదు కాగా.. హీరా గ్రూప్‌ లావాదేవీలపై ఈడీకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది. గతంలో దాఖలైన ఓ పిటి షన్‌ను విచారించిన రాష్ట్ర హైకోర్టు హీరా గ్రూప్‌పై నమోదైన కేసుల్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు బదిలీ చేయాలం టూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులను ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేయజాలదని, దర్యాప్తు పూర్తి చేసిన 7 కేసుల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సీసీఎస్‌ పోలీసులు చెప్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాల్‌కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. సర్కారు ఈ మేరకు సోమవారం అనుమతి మంజూరు చేసింది.  

మరిన్ని వార్తలు