కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు

11 Nov, 2019 20:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం  కర్నూల్‌-సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను  లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్‌ క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్‌ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్‌ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాం‍దోళనకు గురయ్యారు.  ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని  సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

చదవండి: కాచిగూడ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీ 

మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే  పలు రైళ్లను రద్దు చేశారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో  ఉదయం  ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటన దృష్ట్యా  లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించే వాటిని  సికింద్రాబాద్‌కే పరిమితం చేయడంతో  ​సికింద్రాబాద్‌ నుంచి  ఫలక్‌నుమా వరకు వెళ్లవలసిన వారు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నాంపల్లి నుంచి ఫలక్‌నుమాకు కూడా సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని  పాక్షికంగా రద్దు చేయగా, కొన్నిం‍టిని దారిమళ్లించారు. ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు.

 

మరిన్ని వార్తలు