‘కల్యాణలక్ష్మి’పై హామీ కోడ్ ఉల్లంఘనే

12 Dec, 2015 05:45 IST|Sakshi
‘కల్యాణలక్ష్మి’పై హామీ కోడ్ ఉల్లంఘనే

సీఎం కేసీఆర్ ప్రకటనను తప్పుబట్టిన కేంద్ర ఎన్నికల సంఘం

 సాక్షి, న్యూఢిల్లీ: కల్యాణలక్ష్మి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకూ వర్తింపజేస్తామంటూ నవంబర్ 17న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తపస్ కుమార్...కేసీఆర్ ప్రకటనను కోడ్ ఉల్లంఘనగా తేల్చారు.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా అధికార టీఆర్‌ఎస్ బట్టల పంపిణీ, క్రిస్మస్ విందు ఏర్పాట్లు, మెస్ చార్జీల రీయింబర్స్‌మెంట్, పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచినట్లు మాకు పలు పార్టీలు, అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే వీటిని రాష్ట్రం మొత్తానికి వర్తించేవిగా పరిగణించి ఏ చర్యకూ ఉపక్రమించడం లేదు. అయితే కల్యాణ లక్ష్మి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకూ వర్తింపజేస్తామని నవంబర్ 17న ఉప ఎన్నిక ప్రచారంలో మీరు ప్రకటించడం ఎన్నికల కోడ్‌లోని పేరా ఏడు నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణనలోకి తీసుకున్నాం. ఉప ఎన్నిక ముగిసినప్పటికీ మీ చర్యను ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టుగానే ఉత్తర్వు జారీచేస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఇలాంటి చర్యలను పునరావృతం కానివ్వకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సలహా ఇస్తున్నాం..’’ అని తపస్ కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు