బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్‌

28 Jul, 2019 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. 

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. 

కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్‌కౌర్‌ కూడా బోనమెత్తారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు