భద్రాద్రిలో సెల్‌ఫోన్‌లతో నో ఎంట్రీ

14 Jun, 2017 03:24 IST|Sakshi
భద్రాద్రిలో సెల్‌ఫోన్‌లతో నో ఎంట్రీ
- 16 నుంచి రామాలయంలో అమలు
బయట కౌంటర్‌లో అప్పగించాల్సిందే..
 
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక నుంచి సెల్‌ఫోన్లు తీసుకురావటానికి వీల్లేదు. ఈనెల 16 నుంచి రామాలయం ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లను అనుమతించకుండా ఈవో ప్రభాకర శ్రీనివాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆలయ భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు తీసుకొచ్చే సెల్‌ఫోన్లను ఆలయం బయట భద్రపరిచేందుకు గాను ఇప్పటికే టెండర్‌లను నిర్వహించి, ఓ కాంట్రాక్టర్‌కు లైసెన్స్‌ ఇచ్చారు. దీనికి విపరీతమైన పోటీ ఏర్పడి ఏడాదికి రూ.10.40 లక్షలు పలికింది.

ఇక నుంచి కౌంటర్లలోనే సెల్‌ఫోన్‌లను పెట్టి భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లాలి. అయితే, దీనిపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భగుడిలోకి వెళ్లేవారికి ఈ నిబంధన పెడితే ఓకే కానీ.. ఆలయ ప్రాంగణంలోకి తేవద్దనడం సమంజసం కాదని అంటున్నారు. కాగా, గర్భగుడిలోకి సెల్‌ఫోన్లను నిషేధించటం మంచిదేనని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. గతంలో కూడా ఇలాగే సెల్‌ఫోన్‌లను లోపలకి అనుమతించకుండా బయట కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో కొద్దికాలానికే ఈ నిబంధనను ఎత్తివేశారు. ఆలయంలో భద్రత చర్యలు పర్యవేక్షించేందుకు ఎస్టీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం హోంగార్డుల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. సెల్‌ఫోన్‌లను గర్భగుడిలోకి తీసుకెళ్లకుండా లేదా స్విచ్ఛాఫ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కానీ, ఆలయ అధికారులు వీటిపై దృష్టి సారించకుండా ఏకంగా ఫోన్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని భక్తులు అంటున్నారు. 
మరిన్ని వార్తలు