సిమెంట్ బ్యాగుపై రూ. 20-25 తగ్గింపు

24 Jul, 2014 02:48 IST|Sakshi

ప్రభుత్వ ఒత్తిడితో కంపెనీల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించాలని బిల్డర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం బిల్డర్లు, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు.  సుదీర్ఘంగా సాగిన సమావేశం తరువాత ప్రభుత్వ ఒత్తిడి, బిల్డర్ల ఆందోళన నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు తమ పట్టును తగ్గించాయి. మార్కెట్‌లో ఉన్న ధరలపై ఒక బస్తాకు రూ. 20 నుంచి 25 వరకు  తగ్గించుకోవడానికి ముందుకు వచ్చాయి. సీఎస్ రాజీవ్‌శర్మ వద్ద జరిగిన సమావేశంలో సాగర్, పెన్నా, ఓరియంట్, కేశోరాం, డెక్కన్, నాగార్జున, మై హోం సిమెంట్‌కంపెనీలప్రతినిధులు, క్రెడాయ్ ప్రతినిధులు శేఖర్‌రెడ్డి తదితర బిల్డర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాత సాగర్ సిమెంట్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ భాగస్వామ్యం అందించడానికి పూర్తిసహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు మార్కెట్ ధరపై ఒక్కో బస్తా సిమెంటుకు రూ. 20 నుంచి రూ.25 వరకు తగ్గించి విక్రయించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.  క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని, సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు ధరను తగ్గించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు