భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్

10 Nov, 2016 08:20 IST|Sakshi
భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్

విద్యుత్ ప్లాంట్‌కు అనుమతిని నిరాకరించిన కేంద్రం
 కేంద్ర విద్యుత్ శాఖ పాలసీకి విరుద్ధమని స్పష్టీకరణ
 ఎన్జీటీ కేసులు, పర్యావరణ వివాదాలతో
 ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు
 32 నెలల నిర్మాణ గడువులో ఇప్పటికే 20 నెలలు పూర్తి

 
 సాక్షి, హైదరాబాద్/పినపాక: జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించతలపెట్టిన భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు జారీ చేయలేమని తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. 13వ పంచవర్ష ప్రణాళిక (2017-22) కాలంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని 2009 నవంబర్ 13న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారిత ప్లాంట్లకు అనుమతిచ్చే ప్రతిపాదనలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం జెన్‌కో సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలనార్హం కావని ప్రకటిస్తూ ఈ నెల 4న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కేసుతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో ఇరుక్కుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు మూలనపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
 మిగిలింది మరో 12 నెలల గడువే..
 ‘ఇండియా బుల్స్’అనే ప్రైవేటు కంపెనీ కోసం 270 మెగావాట్ల సామర్థ్యం గల 10 సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన బాయిర్లు, జనరేటర్లు, టర్బైయిన్లను కొన్నేళ్ల కింద బీహెచ్‌ఈఎల్ తయారు చేసింది. అరుుతే, యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇండియా బుల్స్‌తో సహా దేశ వ్యాప్తంగా 214 బొగ్గు గనుల కంపెనీలకు కేటాయింపులను 2014లో సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో బీహెచ్‌ఈఎల్‌తో సైతం ఇండియా బుల్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇండియా బుల్స్ కోసం రూపొందించిన పరికరాలు సిద్ధంగా వుండడంతో కేవలం రెండేళ్లలో రాష్ట్రంలో థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని బీహెచ్‌ఈఎల్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 5,044 కోట్ల అంచనా వ్యయంతో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం దాదాపు ఏడాదిన్నర కింద బీహెచ్‌ఈఎల్, జెన్‌కో మధ్య ఒప్పందం కుదిరింది. అతి తక్కువ సమయంలో అనగా, 2015 మార్చి నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఈ ఒప్పందం జరిగింది. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత ప్రతి మూడు నెలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది.
 
 ఇప్పటికే 20 నెలల కాలం ముగిసిపోగా ఈ ప్లాంట్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. మరో 12 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి పీయూశ్ గోయల్‌ను కలసి విజ్ఞప్తి కూడా చేశారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడం పట్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదిలోనే అభ్యంతరం తెలపడంతో ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు రాలేదు. ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని అప్పట్లో షరతులు విధించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ... తాజాగా ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
 
 ఆందోళనలో నిర్వాసిత యువత
 భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు నిరాకరిం చడంతో ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోరుు పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకున్న నిర్వాసిత యువత తీవ్ర ఆందోళన చెందుతోంది. నిర్వాసితుల కోటాలో పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకొని ఇప్పటికే ఐటీఐలో చేరి శిక్షణ పొందుతున్న యువత తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆందోళనలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించే విద్యుత్ ప్లాంట్ సామగ్రిని 40 శాతం మేర నిర్మాణ ప్రాంతమైన పినపాక -మణుగూరు మండలాలకు తరలించడం గమనార్హం.

మరిన్ని వార్తలు