ఓటాన్‌ బడ్జెట్‌ బదులు ఓట్ల బడ్జెట్‌: దాసోజు

3 Feb, 2019 04:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టింది ఓటాన్‌ బడ్జెట్‌ కాదని, ఓట్ల వేట కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో, గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ప్రతీ రైతుపై రూ.47వేల అప్పు ఉంటే, ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు వారికి ఎలా సరిపోతాయో చెప్పాలన్నారు.

ఎంఎస్పీ ధరలు పెంచాలని స్వామినాథన్‌ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తూతూ మంత్రంగా మద్దతు ధర ప్రకటించడం వల్ల దేశ వ్యాప్తంగా రైతులు సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. రైతు అనుబంధ రంగాల్లో జీఎస్టీ ప్రభావంతో రైతాంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల అసమర్థత వల్లే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి అమలు కావాల్సిన హామీలను సాధించడంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విఫలమైందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు