ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్‌ చెల్లదు 

25 Dec, 2019 03:46 IST|Sakshi

కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను కొట్టేసిన క్యాట్‌

కాపురంలో కలహాలు సహజం.. కౌన్సెలింగ్‌ ఇస్తే చాలని వ్యాఖ్య  

సాక్షి, హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) కొట్టేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ శిక్షణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ పోలీస్‌ అకాడమీలను ఆదేశించింది. మహేశ్వర్‌రెడ్డి భార్య ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయ డాన్ని కారణంగా చూపించి ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్న సమయంలో సస్పెండ్‌ చేయడాన్ని క్యాట్‌ తప్పుపట్టింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్‌ చేశారని మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ చేసిన పిటిషన్‌ను క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌ల ధర్మాసనం మంగళవారం విచారించి ఉత్తర్వులు జారీ చేసింది.

బీటెక్‌లో సహ విద్యార్థిని భావనను మహేశ్వర్‌రెడ్డి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారని, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో విడాకులు ఇస్తారనే భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని పిటిషనర్‌ న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదించారు. ఐపీఎస్‌కు ఎంపిక అయ్యాక అధికారిక పత్రాల్లో కూడా వివాహం జరిగినట్లుగా రాశారని, భార్య పేరు భావన అనే రాశారని వివరించారు. ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్‌కు ఆమె ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే దానికి మహేశ్వర్‌రెడ్డి జవాబుతో డైరెక్టర్‌ సంతృప్తిని వ్యక్తపరిచా రంటూ వాటి పత్రాలను నివేదించారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాక సస్పెండ్‌ చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు.
 
బెంగళూరు సగం ఖాళీ అవుతుంది.. 
ఈ వాదనలపై జస్టిస్‌ నర్సింహారెడ్డి స్పందిస్తూ.. ‘రికార్డుల్లో మహేశ్వర్‌రెడ్డి తన భార్య భావన అని చెప్పారు. ఆరోపణలకు ఇచ్చిన జవాబుతో ముస్సోరి అకాడమీ డైరెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ ఉంది. దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆరోపణల దశలో ఉండగానే ఏవిధంగా సస్పెండ్‌ చేస్తారు..’అని ప్రశ్నించారు. బెంగళూరులో అయితే పది ఫ్యామిలీ కోర్టులకు విడాకుల కోసం వచ్చే వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారేనని, వాళ్లలో చాలామందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వారందరినీ సస్పెండ్‌ చేస్తే బెంగళూరు సగం ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. కాపురంలో కలహాలు సహజమని, కౌన్సెలింగ్‌ సరిగ్గా జరిగితే కాపురాలు నిలబడతాయని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌ ఉందని చెప్పి సస్పెండ్‌ చేయడం చట్టవ్యతిరేకమని, తుది ఆదేశాలను బట్టి స్పందిస్తే తప్పులేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు