అక్టోబర్‌లో ‘ఓటర్ల’ సవరణ 

12 Aug, 2019 03:19 IST|Sakshi

2020 జనవరి 1 అర్హత తేదీగా కార్యక్రమం 

అక్టోబర్‌ 15న ముసాయిదా జాబితా ప్రకటన  

నవంబర్‌ 30 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ ఓటర్లను తొలగించి, ఇతర లోపాలను సరిదిద్దిన తర్వాత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్‌ 15 నాటికి ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేయాలని, అదే రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరింది. 2020 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ జరపాలని సూచించింది. అంటే, 2020 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు కానున్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తును నవంబర్‌ 30 వరకు స్వీకరించనున్నారు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు నవంబర్‌ 2, 3, 9, 11 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల నమోదు దరఖాస్తులతో పాటు అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 15 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.  

లోపాలపై ప్రత్యేక దృష్టి.. 
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో లోపాలపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఓటర్ల జాబితా నుంచి డూప్లికేట్‌ ఓటర్ల ఏరివేత, ఇతర లోపాలను సరిదిద్దడంతో పా టు ఓటర్ల ఫొటోల నాణ్యతను పరీక్షించే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను (సీఈఓ) ఇటీవల ఆదేశించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఓటర్లు తమ పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్, రేషన్‌ కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్‌ని స్వచ్ఛందంగా సమరి్పంచి తమ ఓటు హక్కును ధ్రువీకరించుకునేలా ప్రోత్సహించాలని కోరింది.  

ఇంటింటికీ తిరిగి.. 
బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) సెపె్టంబర్‌ 1 నుంచి 30 వరకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలను సరిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.  ఆ సమాచారాన్ని ఏఈఆర్‌వో/ఈఆర్‌వో/డీఈవోలు /రోల్‌ అబ్జర్వర్లు అక్టోబర్‌ 15లోగా పరీక్షించాలంది.

మరిన్ని వార్తలు