యాదాద్రికి 6 లేన్ల రోడ్డు

4 Jul, 2018 02:51 IST|Sakshi

హైదరాబాద్‌-భూపాలపట్నం రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం

నగరం నుంచి యాదాద్రికి ఆరు వరుసల రోడ్డు నిర్మాణం

భారతమాల పథకంలో భాగంగా విస్తరణ

అదనపు భూ సేకరణ లేకుండానే పనులు

ప్రమాదాల నివారణకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు

సాక్షి, యాదాద్రి : హైదరాబాద్‌–భూపాలపట్నం జాతీయ రహదారి–163 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధిం చిన డీపీఆర్‌కు జాతీయ రహదారుల శాఖ ఆమోద ముద్ర వేసింది. భారతమాల పథకంలో భాగంగా విస్తరించనున్న ఈ రహదారిని హైదరాబాద్‌ నుంచి యాదాద్రి (33 కిలోమీటర్లు) వరకు 6 లేన్లుగా నిర్మించనున్నారు. అదనపు భూ సేకరణ లేకుండా రెండు వైపులా ప్రస్తుత రహదారుల హద్దులు, సర్వీస్‌ రోడ్లను కలుపుకుని రోడ్డును విస్తరించ నున్నారు. ప్రమాదాల నివారణకు బస్టాప్‌ల వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు, మినీ అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.    

అన్నింటికీ అనుసంధానంగా..
హైదరాబాద్‌–వరంగల్‌ రోడ్డు విస్తరణలో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్‌–యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు మీదుగా శని, ఆదివారాల్లో 25 వేల వరకు.. మిగతా రోజుల్లో 20 వేల వరకు వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక రాయగిరి నుంచి వరంగల్‌ వరకు 90 కిలోమీటర్లకు పైగా రోడ్డును 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే యాదాద్రి పుణ్యక్షేత్రం, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మీదుగా కోస్తాంధ్ర, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్రలకు రవాణా సౌకర్యం పెరిగింది.

గోదావరి నదిపై ఏటూరు నాగారం, కాళేశ్వరం వద్ద నిర్మించిన వంతెనలతో హైదరాబాద్‌కు వాహనాల రాకపోకలు పెరిగాయి. రానున్న దసరా నాటికి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రధానాలయం నిర్మాణం పూర్తయితే భక్తుల రద్దీతో వాహనాల సంఖ్య రెండింతలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానాలయం భక్తులకు అందుబాటులోకి వస్తే రోజూ లక్ష మంది వరకు భక్తులు రావొచ్చని, ఇందులో అధిక శాతం హైదరాబాద్‌ నుంచే వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాగే బీబీనగర్‌ వద్ద నిమ్స్, ఎయిమ్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. యాదాద్రి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటన్నింటికీ అనుసంధానంగా ఉండేలా రోడ్డును 6 లేన్లుగా విస్తరించనున్నారు.  

నిమ్స్‌ వద్ద ఎస్కలేటర్లు
ప్రస్తుత నాలుగు లేన్ల రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద సెఫ్టీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న బీబీనగర్‌లోని నిమ్స్‌ ప్రాంగణం వద్ద ఎస్కలేటర్‌ నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఎయిమ్స్‌ ఏర్పాటు చేయబోతోంది. బీబీనగర్‌ పట్టణంలో పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, భువనగిరిలోని సింగన్నగూడెం వద్ద రూ. 6 కోట్ల వ్యయంతో మినీ అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. కాగా, యాదాద్రి రోడ్డు మార్గంలో పలు చోట్ల భూ సేకరణ జరగాల్సి ఉండటంతో సర్వీస్‌ రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. దీంతో భూ సేకరణ వేగం పెంచాలని జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

మరిన్ని వార్తలు