రైలు బోగీల్లో ఏసీ 25 డిగ్రీలే..

17 Mar, 2020 03:50 IST|Sakshi

అంతకంటే చల్లగా ఉండనివ్వరు

కర్టెన్ల తొలగింపు.. బెడ్‌షీట్లు మాత్రమే అందుబాటులోకి 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.  ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో సాధారణంగా ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రత 17, 18 డిగ్రీలుగా ఉండేలా చూస్తారు. కానీ కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఏసీ బోగీల్లో ఉండే కర్టెన్లు అన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. కర్టెన్లను నిత్యం మార్చరు. కొన్ని రైళ్లలో పక్షం రోజులకోసారి, కొన్నింటిలో నెలకోసారి మార్చి ఉతికినవి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితిలో అవి ఉండటం క్షేమం కాదని అధికారులు నిర్ణయించారు. అలాగే ఏసీ బోగీల్లో సాధారణ బెడ్‌షీట్లను అందుబాటులో ఉంచుతారు. వాటిని నిత్యం మార్చి ఉతికిన జతను సరఫరా చేస్తున్నందున వాటిని  అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు ఇచ్చే బ్లాంకెట్లను మాత్రం తొలగించారు. వీటిని రోజూ ఉతకరు. మరీ చలిని తట్టుకోలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మాత్రం రెండు మూడు ఉతికి శుభ్రంగా ఉన్నవి అందుబాటులో ఉంచుతారు.  ఇక రైళ్లను అప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నారు.  టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని, అక్కడ చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బు ద్రావణం, ఇతర క్రిమి సంహారక ద్రావణాలు ఉంచాలని రైల్వే శాఖ ఆదేశించింది.

మరిన్ని వార్తలు