నెగెటివ్‌ వచ్చినా.. 14 రోజులు ఇంట్లో ఉండాల్సిందే

3 Apr, 2020 03:49 IST|Sakshi

కరోనా నెగెటివ్‌ వ్యక్తులకు కేంద్రం మార్గదర్శకాలు 

క్వారంటైన్‌ నుంచి ఊళ్లకు వెళ్లేవారికి పాస్‌ల జారీ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉండి, నెగెటివ్‌గా తేలినవారు మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన దరిమిలా.. ప్రభు త్వం క్వారంటైన్‌లో ఉన్నవారిలో నెగెటివ్‌గా తేలినవారు పాటించాల్సిన నియమ నిబంధనలను కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసింది. శరీరంలో వైరస్‌ లేదని నిర్ధారణ అయినా కూడా బాధితులు మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని పేర్కొంది. 
నిబంధనలు ఇవే..

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి కరోనా నెగెటివ్‌గా తేలితే.. హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం.. వారిని విడుదల చేస్తారు. కానీ బృందాలుగా క్వారంటైన్‌ సెంటర్‌కు అనుమానితులుగా వచ్చిన వారిలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా..  ఎవరినీ బయటికి అనుమతించరు. 
ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో కొందరు పౌరులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరంతా వారి సొంత రవాణా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 
క్వారంటైన్‌ అయిన ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే వీరికి ప్రత్యేక పాసులు జారీ చేస్తుంది. 
 వీరికి ఒకే రూటులో నిర్ణీత కాల పరిమితితో పాసులు జారీ అవుతాయి. 
ఈ పాసులు జారీ అయిన మార్గంలో వీరి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. 
వీరు సొంతూళ్లకు వెళ్లాక తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. పైగా ఎక్కడ ఉంటున్నామన్న వివరాలు సదరు వ్యక్తి ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు