మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌

6 Apr, 2020 03:03 IST|Sakshi
ఆదివారం టోలిచౌకి ప్రాంతంలో కిటకిటలాడుతున్న జనం

రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సూచన 

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో తీరుపై కేంద్ర నిఘా వర్గాల ఆరా

అక్కడి పరిస్థితిపై వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. కొన్నిచోట్ల లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడంలేదని, వెంటనే దీనిపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్‌ జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమగ్రంగా అమలు కావట్లేదని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. దీంతో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరుపై వీడియో రికార్డింగ్‌ తీసి పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అవసరమైతే తమకు వీడియో కాల్‌ ద్వారా పరిస్థితిని వివరించాలని సూచించింది. దీంతో శని, ఆదివారాల్లో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి వీడియో రికార్డ్‌ చేయడంతో పాటు కేంద్ర అధికారులకు వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేసి పరిస్థితిని వివరించాయి. 

మర్కజ్‌ సంబంధంతో మరింత అప్రమత్తం.. 
రాష్ట్రంలో మార్చి 31 నుంచి కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల వ్యవధిలోనే 190 కేసులు నమోదయ్యాయి. మార్చి 31న 15 కేసులు, ఏప్రిల్‌ 1 నుంచి వరుసగా భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో ఏకంగా ఒకేరోజు 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మర్కజ్‌ వ్యవహారంతో సంబంధమున్నవే కావడం గమనార్హం. ఒకట్రెండు కేసులు మినహా అన్నీ ఢిల్లీతో లింకు ఉన్నవే. మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో కనెక్ట్‌ అయిన కరోనా కేసుల సంఖ్య బయటపడుతూ వస్తున్నాయి. మార్చి 22న కేంద్రం జనతా కర్ఫ్యూ విధించింది. మరుసటి రోజు నుంచే మన రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. అనంతరం కేంద్రం కూడా దేశమంతా లాక్‌డౌన్‌ విధించింది. అయినా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గట్లేదు. దేశమంతా లాక్‌డౌన్‌ విధించే సమయానికి తెలంగాణలో ఐదారు జిల్లాల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఐదారు రోజులుగా వరుసగా దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి.

మున్ముందు మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులన్నీ కూడా మర్కజ్‌తో సంబంధమున్నవేనని తేలింది. పైగా అక్కడికి వెళ్లి వచ్చిన వారి కుటుంబాలకే కాకుండా ఇతరులకు కూడా ఇది సోకుతోంది. దాంతో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో అసలు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సరిగా అమలవుతోందా అన్న అనుమానం కేంద్రానికి కలిగింది. దీంతో పరిస్థితిని నేరుగా పరిశీలిస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వెంటనే అక్కడికి వెళ్లి లైవ్‌లో ఆ ప్రదేశాలను చూపించాలని కూడా కేంద్ర అధికారులు ఆదేశించారు. దాంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు కేంద్ర అధికారులు సూచించిన ప్రాంతాలకు ఆగమేఘాల మీద వెళ్లి లైవ్‌లో లాక్‌ డౌన్‌ అమలు, అక్కడి ప్రజల కదలికలను చూపించారు. అనంతరం కేంద్రం అక్కడి పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాల్లోనే కేంద్రం ఆరా తీసింది. అలాగే మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించింది. అలాగే వరంగల్‌ అర్బన్, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాల్లో పరిస్థుతులపై ఆరా తీసినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు