కరోనా అలర్ట్‌ @ ‘ఆరోగ్యసేతు’

4 Apr, 2020 02:17 IST|Sakshi

ప్రజల్లో అవగాహనకు కేంద్రం కొత్త యాప్‌

కరోనాపై రోజూ అప్‌డేట్స్, సలహా సూచనలు

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై ఇప్పటికే లాక్‌డౌన్‌ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డిజిటల్‌ వార్‌కు దిగింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్‌డేట్స్‌ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండ్రోజుల క్రితం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వినియోగంలోకి వచ్చింది.

ఇలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి..
రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ విరుగుడుకు ఇంకా మందు రాలేదు. అవగాహనతోనే దీనిని ఎదుర్కోగలమని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
► ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’పేరు నమోదు చేసిన వెంటనే యాప్‌ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఓపెన్‌ చేయాలి.
► జీపీఎస్‌ ఆధారంగా లొకేషన్‌ ఎంపిక చేసుకున్నాక మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
► ప్రస్తుతం 11 భాషల్లో యాప్‌ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్‌ నిరంతరం ఆన్‌లో ఉండాలి. అప్పుడే ఈ యాప్‌ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది.

అప్రమత్తం చేస్తుందిలా..
► యాప్‌ను ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. యూజర్లు 4.6 పాయింట్ల రేటింగ్‌ ఇచ్చారు. 13,330 మంది సానుకూలమైన రివ్యూలు రాశారు.
► ఈ యాప్‌ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది.
► కరోనా వైరస్‌ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌ ఎలా పాటించాలో సూచిస్తుంది.

>
మరిన్ని వార్తలు