యురేనియం సర్వేపై మీ వైఖరేమిటి?

15 May, 2020 04:10 IST|Sakshi

రాష్ట్రాన్ని కోరిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో యురేనియం ని ల్వలు ఎక్కడెక్కడున్నాయన్న దానిపై సర్వే చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కోరింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్‌ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశం సూచించింది.

గతంలో జరిగిందిదీ..: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం 200, 300 మీటర్ల లోతున అటవీ ప్రాంతవ్యాప్తంగా 4 వేల బోర్లు వేస్తామని, దాదాపు ఐదేళ్ల్లపాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ గతేడాది టమిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) నుంచి ప్రతి పాదనలు వచ్చాయి. గత ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న ఈ కొత్త ప్రతిపాదనలను తిరస్కరిస్తూ సంబంధిత ఫైల్‌ను జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు తాజా గా తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వారం, పదిరోజుల క్రితమే ఈ మేరకు నివేదికను హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదించినట్టు తెలుస్తోంది.

ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటివల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అడవిలో ప్రతిపాదిత బోరు వేసే పాయింట్లను ఏఎండీ సాంకేతిక బృందం వచ్చి చూపిస్తే తప్ప గుర్తించలేమని, ఈ బృందాల ప్రవేశానికి కూడా స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచి, ఏటీఆర్‌లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తెలియజేసే అవకాశముందని సమాచారం.  

మరిన్ని వార్తలు