పాలమూరు రైల్వే ప్రాజెక్టులకు నిదులు

11 Jul, 2019 07:40 IST|Sakshi
చురుగ్గా సాగుతున్న మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ పనులు

మునీరాబాద్‌ రైల్వేలైన్‌కు రూ.275 కోట్లు 

డబ్లింగ్‌ లైన్‌కు రూ.200 కోట్లు కేటాయింపు 

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరులోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కరుణించింది. గతేడాది తరహాలోనే మునీరాబాద్‌ రైల్వేలైన్‌కు రూ.275కోట్లు కేటాయించగా.. సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల రైల్వేలైన్‌తో పాటు మహబూబ్‌నగర్‌ ఆదర్శ రైల్వేస్టేషన్‌కు ఈ ఏడాది కూడా మోక్షం కలగలేదు.

ఇటీవలే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల వివరాలను గురువారం దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. బడ్జెట్‌లో మహబూబ్‌నగర్‌– మునీరాబాద్‌ రైల్వే, సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు అధిక నిధులు వెచ్చించారు. మునీరాబాద్‌కు గతేడాది రూ.275 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.275 రావడం విశేషం. అలాగే డబ్లింగ్‌ లైన్‌కు రూ.200 కోట్లు విడుదల చేశారు.  

రెండేళ్ల నుంచి అధికం.. 
దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఉందానగర్‌ నుంచి ప్రారంభమైన డబ్లింగ్‌ రైల్వే పనులు జిల్లా పరిధిలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ రైల్వే లైన్‌ పూర్తిపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 9 మేజర్, 92 మైనర్‌ బ్రిడ్జిల నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు డబ్లింగ్‌ లైన్‌ పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.   

తగ్గనున్న దూరభారం 
సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్‌ లైన్‌ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్‌ నుంచి వంద కి.మీ. దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్‌ లైన్‌ పూర్తయితే గంట సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. 

పురోగతిలో మునీరాబాద్‌ 
మహబూబ్‌నగర్‌– మునీరాబాద్‌ రైల్వేలైన్‌ 246 కి.మీ. నిర్మాణానికి 1997– 98లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టగా ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో రూ.275 కోట్లు కేటాయించారు. గతేడాది సైతం ఇదే స్థాయిలో నిధులు వచ్చాయి. ఈ లైన్‌ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 29 కి.మీ. మేర పూర్తయ్యాయి. దేవరకద్ర– జక్లేర్‌ మధ్య లైన్‌ పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని కృష్ణాతో పాటు కర్ణాటక రాష్ట్రం మునీరాబాద్‌ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి.

సర్వేల్లోనే గద్వాల– మాచర్ల 
గద్వాల– మాచర్ల  రైల్వేలైన్‌ నిర్మాణం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆమోదమే లభించలేదు. దీని కోసం మూడు సార్లు సర్వే పూర్తయినా రైల్వేలైన్‌ నిర్మాణ ప్రక్రియ ప్రారంభకాకపోవడం ఈ ప్రాంత ప్రయణికులను ఆవేదనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్‌ కూడా నెరవేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     
  

మరిన్ని వార్తలు