అప్రెంటిస్‌షిప్‌ ఉంటేనే కొలువు!

1 Dec, 2019 01:38 IST|Sakshi

డెసిగ్నేటెడ్, ఆప్షనల్‌ ట్రేడ్‌లకు తప్పనిసరి చేసిన కేంద్రం

నలుగురు కంటే ఎక్కువ మంది ఉన్న సంస్థల్లో వృత్యంతర శిక్షణ

ఆ సమయంలో వేతనాలు నిర్దేశిత శ్లాబ్‌లవారీగా చెల్లింపు

అప్రెంటిస్‌షిప్‌ సవరణ నిబంధనలు విడుదల చేసిన కార్మిక, ఉపాధి కల్పనశాఖ

సాక్షి, హైదరాబాద్‌: అప్రెంటిస్‌షిప్‌... ఇకపై ప్రైవేటు సంస్థలోనే కాదు షాపింగ్‌ మాల్, షోరూం, సూపర్‌ మార్కెట్‌ లాంటి ఎందులో ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరి కానుంది. ఈ అర్హత ఉన్న వారికే ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. డెసిగ్నేటెడ్‌ ట్రేడ్‌లతోపాటు ఆప్షనల్‌ కేటగిరీలో వచ్చే ప్రతి కొలువు భర్తీని అప్రెంటీస్‌షిప్‌తో కేంద్రం ముడిపెట్టింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పనశాఖ అప్రెంటిస్‌షిప్‌ (సవరణ) నిబంధనలు–2019 విడుదల చేసింది.

కార్మికశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా అప్రెంటిస్‌షిప్‌ ఇవ్వొచ్చు. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం వరకు అప్రెంటిస్‌షిప్‌ అభ్యర్థులను నియమించుకోవచ్చు. వర్కింగ్‌ ట్రేడ్‌లవారీగా వేతనాలు నిర్దేశించినప్పటికీ గరిష్ట విభాగాల్లో నియమించుకున్న వారికి తొలి ఏడాది రూ. 7,000, రెండో ఏడాది రూ. 7,700, మూడో ఏడాది రూ. 8,800 చొప్పున వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

రాయితీలతో ప్రోత్సాహం... 
ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్న చిన్నపాటి దుకాణం మొదలు పదులు, వందల సంఖ్యలో ఉన్న సంసల్లో అప్రెంటిస్‌షిప్‌కు వీలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను సైతం ప్రకటించింది. 15 శాతం వరకు ఉద్యోగాలను అప్రెంటిస్‌షిప్‌తో నింపుకోవచ్చని ప్రకటించిన కేంద్రం వారికి చెల్లించే వేతనాల్లో ఒక్కో ఉద్యోగికి రూ. 1,500 చొప్పున భరించనుంది. దీంతో సంస్థకు వేతన చెల్లింపుల భారం తగ్గుతుంది. ఆయా సంస్థలు నైపుణ్యాభివృద్ధి కల్పనలో భాగస్వామ్యం అవుతాయనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

అప్రెంటిస్‌షిప్‌ కోసం కంపెనీ apprenticeshipindia.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే కేంద్రం ప్రకటించిన రాయితీలు వస్తాయి. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసిన అభ్యర్థికి పరీక్ష రాసే అర్హత సర్టిఫికెట్‌ జారీ ప్రక్రియ సులభతరమవుతుంది. అప్రెంటిస్‌షిప్‌ చేసిన కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు పొందే అవకాశంతోపాటు జాబ్‌ మేళాలు, ఇతర నియామకాల ప్రక్రియలో ఈ సర్టిఫికెట్లు దోహదపడతాయని కార్మిక ఉపాధి కల్పనశాఖ సంచాలకుడు కె.వై. నాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ఎక్కడైనా చెల్లుతుంది...
అప్రెంటిస్‌షిప్‌ పొందిన అభ్యర్థికి కేంద్ర ప్రభుత్వం సంబంధిత ట్రేడ్‌లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. ఇందుకు అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసిన తర్వాత సంబంధింత సంస్థ అనుమతితో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ సర్టిఫికెట్‌తో దేశంలో ఎక్కడైనా సంబంధిత ట్రేడ్‌లో ఉద్యోగానికి అర్హుతగల వ్యక్తిగా పరిగణిస్తారు. ఐటీఐ ద్వారా పూర్తి చేసిన కోర్సును డెసిగ్నేటెడ్‌ ట్రేడ్‌గా, ఐటీఐయేతర కేటగిరీలను ఆప్షనల్‌ ట్రేడ్‌లుగా విభజించిన కేంద్రం... వాటి అప్రెంటిస్‌షిప్‌కు దిశానిర్దేశం చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా