ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ఫ్లూ: కేంద్రం సీరియస్

23 Feb, 2015 01:56 IST|Sakshi
ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ఫ్లూ: కేంద్రం సీరియస్

 సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)లో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలోని ఐపీఎస్ ట్రైనీలకు స్వైన్‌ఫ్లూ సోకడంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. సకల సదుపాయాలతో అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ ట్రైనీ ఐపీఎస్‌లు అకాడమీ నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించడంపై హోం శాఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిి సంది.

అకాడమీలో స్వైన్‌ఫ్లూ ప్రబలిన విషయం తెలుసుకున్న ఐపీఎస్ శిక్షణార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 9 మంది శిక్షణార్థులు స్వైన్‌ఫ్లూ బారినపడడానికి దారి తీసిన కారణాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. అకాడమీలోని పరిస్థితులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఓ బృందం త్వరలో అకాడమీకి రానున్నట్లు తెలిసింది.  బయటి నుంచే వైరస్ అటాక్: సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పోలీసు అకాడమీలో ఆరోగ్యకర వాతావరణం ఉందని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు తేల్చారు. బయటి ప్రాంతం నుంచే హెచ్1ఎన్1 వైరస్ అకాడమీలోకి వ్యాపించిందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.

తిరుపతి ఉప ఎన్నికల పరిశీలన కోసం అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాకే ట్రైనీ ఐపీఎస్‌లు అస్వస్థతకు గురయ్యారని అకాడమీ అధికారులు తెలిపారు. వైరస్ సోకిన 9 మంది అకాడమీ వసతి భవనంలోని ఒకే బ్లాక్‌లో బస చేసేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా, వీరిలో ఆరు మంది కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు