ఆడబిడ్డకు అండగా

15 Sep, 2014 02:18 IST|Sakshi

ఇందూరు:  ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘బేటీ బచావో...బేటీ పఢావో’ నినాదంతో ప్రజలలో అవగాహన క ల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. మన జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ‘బాలల సంరక్షణ విభాగం’ ఆధ్వర్యంలో  నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.

తేదీలవారీగా షెడ్యూల్‌ను రూపొందించారు. మండలాలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖల సమన్వయం తో ఈనెల 15 లేదా 16న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

 నిర్వహించే కార్యక్రమాలివే
 {భూణ హత్యలు, గర్భధారణ సమయంలోనే వైద్యులచే లింగ నిర్ధారణ చేయించడం, చేయిస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు పడే శిక్షలపై అవగాహన తరగతులు.
 అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసాన్ని, వివక్షను రూపుమాపేందుకు అందుకు అనుగుణమైన అంశాలతో కూడిన వర్క్‌షాప్‌ల నిర్వహణ.
 ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు, చట్టాల గురించి ,విద్య అవసరాలు ఇతర వాటిపై అవగాహన కలిగించడం.
 బాల్య వివాహాలను నిర్మూలించేందుకు గ్రామీణ  ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం. బాల్య వివాహాలతో ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో క్లుప్తంగా వివరించడం.
 దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు బాలికలకు ప్రత్యేక శిక్షణ తరగతులు. హెల్ప్‌లైన్‌కు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు తెలపడం.
 {పతీ పాఠశాలలో పై అంశాలన్నింటిపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం.
 విద్యార్థులచే గ్రామాలు, మండలాలలో విస్తృతంగా ర్యాలీలు, శిక్షణ తరగతులు నిర్వహించి ప్రచారం చేపట్టడం.
 జిల్లాస్థాయిలో పెద్ద కార్యక్రమం నిర్వహించడం.

 నిధుల లేమి..
 ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు పెట్టి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. కానీ, వీటిని విజయవంతగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిధులను కే టాయించడం లేదు. ప్రస్తుతం ‘బేటీ బచావో...బేటీ పఢావో’ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించాలి. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ఒక్క పైసా కూడా కేంద్రం కేటాయించలేదు. మొన్న జరిగిన బాల్య వివాహాలపై సదస్సులు, ర్యాలీలు, పౌష్టికాహార వారోత్సవాలు, తదితర కార్యక్రమాలకు కూడా ప్రభుత్వాలు నిధులు కే టాయించలేదు.

దీంతో వాటిని అంతంతమాత్రంగానే నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద బాధ్యతలు అప్పగించడం, ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితులలో, ఉన్న కొద్దిపాటి నిధులతో సర్దుకోవాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు