భారీ వర్షాలొస్తున్నాయ్‌..వరదలతో జాగ్రత్త

9 Jun, 2017 20:17 IST|Sakshi

- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం
- రాష్ట్రంలోని 10 ప్రాజెక్టుల పరిస్థితిపై సీడబ్ల్యూసీ సీఈ నవీన్‌కుమార్‌ సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రధాన నదీ బేసిన్‌ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావ ప్రాంతాలపై ఆయా రాష్ట్రాలను కేంద్ర జల సంఘం అప్రమత్తం చేసింది. గతేడాదితో పోలిస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అం‍దుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల సంఘం గుర్తించిన నదీ బేసిన్‌లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ప్రమాద ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పింది.

శుక్రవారం ఈ మేరకు కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీర్‌ నవీన్‌కుమార్‌ ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రాజెక్టుల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉం‍డాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, సాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు, శ్రీరాంసాగర్‌, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఆటోమెటిక్‌ రెయిన్‌ గేజ్‌ స్టేషన్లు, ఆటోమెటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డులు, డిజిటల్‌ వాటర్‌ లెవల్‌ రికార్డుల ఏర్పాటు అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణలు కోరారు. అవసరాలను ముందుగానే గుర్తించి వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణా, తుంగభద్రలకు వచ్చే వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్‌ పరివాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాచార మార్చిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు