ఎయిమ్స్‌కు కేంద్రం పచ్చజెండా

21 Apr, 2018 00:42 IST|Sakshi

ఎట్టకేలకు ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు కేంద్రం చర్యలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ఇప్పటికే ఏపీకి ఎయిమ్స్‌ మంజూరు కాగా తెలంగాణలో ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కొంతకాలంగా తెలంగాణ ఆరోపిస్తోంది. తాము అడిగిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావట్లేదని, అందుకే జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రతినిధులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఫలితంగా ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పీఠముడిలా మారింది. గత కేంద్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావన కూడా లేదు. దీంతో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.  

ముందు భూమి కేటాయించండి 
ఎయిమ్స్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం అందించింది. అయితే ఎయిమ్స్‌ ఏర్పాటుకు కావాల్సిన భూమి కేటాయింపు అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం అధీనంలోకి భూమి వస్తేనే మిగతా అంశాలను పట్టించుకుంటామని స్పష్టం చేసింది. గతంలో పలు కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలోనే కేంద్రమంత్రులు ఆరోపణలు చేశారు. భూమిని అప్పగించకపోవడం వల్లే ఆయా సంస్థల ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పుడు ఎయిమ్స్‌ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఇదే విషయాన్ని పేర్కొంది. భూమి కేటాయించాకే డీపీఆర్‌ల తయారీ ఉంటుందని కూడా పేర్కొంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద కేటాయించిన రూ.3,825 కోట్ల నిధుల్లోంచి ఖర్చు చేయనున్నారు.  

సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి అనుమతులు..
ఇప్పటికే మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ కార్యకలాపాలు ప్రారంభించగా, తాజాగా సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి అనుమతి లభించింది. సూర్యాపేట, నల్లగొండల్లో కూడా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఎయిమ్స్‌ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో అత్యవసర, మెరుగైన, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేంద్రానికి సీఎం కేసీఆర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు