29న ‘రీజినల్‌’ డీపీఆర్‌కు ఆమోదం!

19 Jan, 2019 02:07 IST|Sakshi

అలైన్‌మెంట్లను ఖరారు చేయనున్న కేంద్రం

ఆ తర్వాత 2, 3 రోజులకు అధికారిక అనుమతులు

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్‌

కేంద్రం అనుమతిపై అధికారుల ధీమా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్‌మెంట్లు దాదాపు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రోడ్లు, భవనాలశాఖ అధికారులు వాటికి తుదిరూపు ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 29న ఢిల్లీలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో జరిగే సమావేశంలో అలైన్‌మెంట్ల వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర అధికారులు సమర్పించనున్నారు. ఈ భేటీలోనే డీపీఆర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించి ఆ తర్వాత రెండు, మూడు రోజులకు అధికారికంగా అనుమతుల మంజూరును ప్రకటించనున్నట్లు తెలిసింది. 

రెండు వారాల్లో స్పష్టత: ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించేందుకు అధికారులు దాదాపు నాలుగు అలైన్‌మెంట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులో ఎక్కడా న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా వాటిని రూపొందిస్తున్నారు. దాదాపుగా తుది దశకు వచ్చిన డీపీఆర్‌ పనులకు అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఈ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడినట్లు అవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కేంద్రం అనుమతిపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో సంగారెడ్డి–గజ్వేల్‌ రోడ్డుకు జాతీయ రహదారిగా గుర్తింపు రాగా షాద్‌నగర్‌–చౌటుప్పల్‌ రోడ్డుకు ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది. 

ఆమోదం పొందగానే భూసేకరణ... 
డీపీఆర్‌ విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర అధికారులు సమాయత్తమవుతున్నారు. గత సమావేశంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు తెలంగాణకు ఎందుకు అవసరమో విపులంగా వివరించి వారిని ఒప్పించగా ఇప్పుడు కీలకమైన డీపీఆర్‌ ఆమోదానికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీలో డీపీఆర్‌కు ఆమోదం లభించగానే భూసేకరణ పనులు మొదలవుతాయని సమాచారం. మొత్తం 334 కి.మీ.లతో రెండు దశల్లో (సంగారెడ్డి–నర్సాపూర్‌–తూప్రాన్‌–గజ్వేల్‌–జగదేవ్‌పూర్‌–భువనరి–చౌటుప్పల్‌–దాదాపు 154 కి.మీ., చౌటుప్పల్‌–షాద్‌నగర్‌–కంది–దాదాపు 180 కి.మీ.) నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రూ. 12,000 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం 11,000 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. భూసేకరణకు ఖర్చయ్యే రూ. 3,000 కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ స్వయంగా ప్రతిపాదించిన సీఎం కేసీఆర్‌.. ఈ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు