పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా 

20 Sep, 2018 02:22 IST|Sakshi

బీమా కంపెనీలు, ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఝలక్‌

సాక్షి, హైదరాబాద్‌: పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం చెక్‌ పెట్టింది. అందుకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈ మార్గదర్శకాలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌ నుంచి అమలవుతాయని కేంద్రం ప్రకటించింది. అలాగే రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా ఏడాదంతా సాగయ్యే ఉద్యాన పంటలను కూడా పీఎంఎఫ్‌బీవై పథకంలోకి తీసుకొస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. అలాగే అడవి జంతువుల దాడిలో పంటకు నష్టం వాటిల్లితే దానికి కూడా బీమా వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే దీన్ని కూడా పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. డూప్లికేషన్‌ను నివారించేందుకు బీమా పరిహారంలో ఆధార్‌ లింక్‌ను తప్పనిసరిగా అమలుచేయనున్నారు. కంపెనీలు తాము వసూలు చేసే ప్రీమియం సొమ్ములో 0.5 శాతాన్ని బీమాపై రైతులను చైతన్యం చేయడానికి ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. తాజా మార్గదర్శకాలు ఈ పథకంలో ప్రస్తుతం నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు