తెలంగాణలో కేంద్ర పథకాల అమలు భేష్‌

13 Feb, 2018 04:34 IST|Sakshi
కేంద్ర మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి జూపల్లి

     కేంద్ర మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌

     మంత్రి జూపల్లితో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ (టీ సిపార్డ్‌)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో అధికారులు వివరించారు.

ఉపాధి హామీ, పీఎంజీఎస్‌వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్‌ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాంకృపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల మనుగడ రేటు 70 శాతం వరకు ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఉపాధి హామీ పనిదినాల్ని పెంచండి 
దేశానికే ఆదర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందజేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని 16 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో నిలిచిన పనులకు సంబంధించి రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీయంజీఎస్‌వై–2 కింద అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రానికి మూడు విడతల్లో 16 రూర్బన్‌ క్లస్టర్లను మంజూరు చేశారని.. కనీసం జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌కు జూపల్లి వినతి పత్రం అందజేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, సెర్ప్‌ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు