బలిపీఠంపై బడుగు రైతు

27 Mar, 2018 02:26 IST|Sakshi

     తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై కేంద్రం అధ్యయనం 

     బాధితుల్లో 62 శాతం మంది నిరక్షరాస్యులే 

     మూడోవంతు ఆత్మహత్యలు పూర్వ వరంగల్‌ జిల్లాలోనే.. 

     రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: బడుగు రైతు బలిపీఠం మీదున్నాడు. వ్యవసాయం నష్టాలు మిగిల్చి రైతులను కష్టాల పాలుచేస్తోంది. ఆశలు ఆవిరై అన్నదాతలు అసువులుబాస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు బలహీనవర్గాల రైతులే. ఇది కేంద్రం జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సహా అర్థగణాంకశాఖల ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఆగ్రో–ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనం చేసింది. నివేదికను తెలంగాణ వ్యవసాయ శాఖకు అందజేసింది.  

సరాసరి భూమి 2.24 ఎకరాలు... 
2015–16లో జరిగిన ఆత్మహత్యలపై ఆగ్రో–ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనం చేసింది. పూర్వ వరంగల్‌ జిల్లాలో మూడో వంతు ఆత్మహత్యలు జరిగాయి. తర్వాత పూర్వ నల్లగొండ జిల్లాలో 12 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 10 శాతం ఆత్మహత్యలు జరిగాయి. అత్యంత తక్కువగా నిజామాబాద్‌ జిల్లాలో 3.67 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 3.99 శాతం జరిగాయి. 2015 ఖరీఫ్‌లో కరువు కారణంగా పెద్ద ఎత్తున రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలు ప్రతి ఏడాది అధికంగా సెప్టెంబర్‌–డిసెంబర్‌ నెలల మధ్యే జరుగుతున్నాయి. ఈ కాలం ఖరీఫ్‌ ముగిసిన దశ, రబీ సీజన్‌ మొదలయ్యే దశ. ఈ సమయంలో ఖరీఫ్‌ పంటలు కోత దశ నుంచి మార్కెట్లోకి వచ్చి చేరుతాయి. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువ మంది బడుగు బలహీనవర్గాలకు చెందినవారే. అందులో 62 శాతం మంది నిరక్షరాస్యులే. ఆత్మహత్య చేసుకున్న రైతుల వద్ద ఉన్న సరాసరి భూమి 2.24 ఎకరాలు మాత్రమే. బోరు బావులను అధికంగా తవ్వడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడింది. దానికింద సాగు చేస్తే నీరు రాక నష్టాలే మిగిలాయి. బోరు బావుల కింద సాగు చేసిన పత్తికి తీవ్ర నష్టం జరిగి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రభుత్వ సాయం అవసరం 
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు సాగునీటి వనరులు కల్పించాలని, పాడిరంగాన్ని అభివృద్ధి చేయాలని, తక్కువ వడ్డీకి పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని, సాగు ఖర్చు తగ్గించేలా ప్రభుత్వమే ఉచితంగా బోరుబావులు తవ్వించాలని కోరుతున్నారని అధ్యయన నివేదిక తెలిపింది. దాంతోపాటు అధ్యయన బృందం కూడా పలు సూచనలు చేసింది. పత్తి కొనుగోలుకు గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వ్యవస్థీకృత రుణ పద్ధతికి అవకాశం కల్పించాలి. వ్యవసాయ, వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డెవలప్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో స్వచ్ఛంద సంస్థలతో కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

సాగునీటి వసతి... పాడి అభివృద్ధి 
పంటలు నష్టపోవడం, సరైన ధర రాకపోవడం తదితర కారణాలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పేదరికం కూడా ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితులు కూడా రైతును కుదేలు చేశాయి. కుటుంబ సమస్యలు, మద్యానికి బానిసగా మారడం 22 శాతం ఆత్మహత్యలకు కారణంగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల వల్ల కూడా అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సన్న, చిన్నకారు రైతులు ప్రధానంగా వడ్డీ వ్యాపారుల వద్ద 89 శాతం అప్పులు చేశారు. 11 శాతం బ్యాంకుల్లో తీసుకున్నారు. ఒక్కో రైతు సరాసరి రూ.3.63 లక్షల అప్పులు తీసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల రైతుల్లో ప్రధానంగా కుటుంబం సభ్యుల్లో ఇంకెవరూ పనిచేయకపోవడం, వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిలిచిపోవడం, పిల్లలు స్కూలు మానేయడం వంటి కారణాలతో ఆత్మహత్యలు జరిగాయని అధ్యయనంలో వెల్లడైంది.  

మరిన్ని వార్తలు