కోవిడ్‌ నుంచి 19,945 మందికి విముక్తి 

7 Mar, 2020 02:33 IST|Sakshi

28 రోజుల వైద్య పర్యవేక్షణ పూర్తిచేసుకున్న ప్రయాణికులు 

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి

అందులో తెలంగాణలో 100 మందికి విముక్తి 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ నుంచి దేశవ్యాప్తం గా 19,945 మంది విముక్తి పొందారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. మొత్తం 27,481 మంది ప్రయాణికులకు కోవిడ్‌ అనుమానిత లక్షణాలుండటంతో వైద్యులు వారిని తమ పర్యవేక్షణలో ఇళ్లలోనే ఐసోలేషన్‌ చేశారు. ఈ నెల 2 నాటికి వారిలో 19,945 మంది 28 రోజుల కాల పరీక్షలో ఎలాంటి లక్షణాలు లేకుండా బయటపడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక నివేదిక విడుదల చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ లక్షణాలు కనిపించిన 1,647 మంది నుంచి వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. వారిలో 1,564 మందికి నెగటివ్‌ వచ్చినట్లు నివేదిక తెలిపింది. కొందరి వైద్య పరీక్షల వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం 71 మంది దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నారని కేంద్రం తెలిపింది.  

ఢిల్లీలో అత్యధిక మంది... 
అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి ఢిల్లీకి అత్యధిక మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ 5,937 మందిని వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచుకోగా, వారిలో 5,818 మంది 28 రోజుల పరిశీలనా కాలాన్ని పూర్తి చేసుకొని కోవిడ్‌ నుంచి బయటపడ్డారు. తెలంగాణలో 380 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, వారిలో వంద మందికి కోవిడ్‌ లేదని నిర్ధారించినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.  

14 రోజుల నుంచి 28 రోజుల కాలం కీలకం... 
కోవిడ్‌ వైరస్‌ సోకిన వ్యక్తిలో వాటి లక్షణాలు బయటపడటానికి రెండ్రోజుల నుంచి 14 రోజుల వరకు పడుతుంది. మరికొందరిలో 28 రోజుల వరకు కూడా పడుతుందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. కాబట్టి కోవిడ్‌ ఉన్న దేశాల నుంచి వచ్చి, లక్షణాలున్న వారిని 28 రోజులపాటు ఇంట్లోనే ఒంటరిగా ఐసోలేషన్‌లో ఉంచాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

ఇతరత్రా ఎలాంటి అనారోగ్యం లేకపోతే 14 రోజుల్లోనే కోవిడ్‌ బయటపడుతుందని, అనారోగ్యం ఉన్న వారి విషయంలో ఒక్కోసారి 28 రోజులు సమయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఇదిలావుండగా, హైదరాబాద్‌ విమానాశ్రయంలో గురువారం నాటికి 22,790 మంది ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. మొత్తంగా 215 మంది నుంచి కోవిడ్‌ నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించారు. 169 మందికి నెగటివ్‌ అని తేలింది. ఒకరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తేల్చాయి. మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు