ఆ రోహింగ్యాలు ఎక్కడ?

18 Apr, 2020 01:07 IST|Sakshi

నిజాముద్దీన్, మేవాట్‌ జమాత్‌కు హాజరు 

నల్లగొండ, హైదరాబాద్‌లో క్యాంపులకు చేరుకోని కొందరు రోహింగ్యాలు 

వారిని గుర్తించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు 

రంజాన్‌ విరాళాల కోసం వెళ్లి ఉంటారని అనుమానం 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ తబ్లిగీ జమాత్‌కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది. మొన్న ఢిల్లీ ప్రార్థనలు, నిన్న యూపీలోని దేవ్‌బంద్‌కు తబ్లిగీ జమాత్‌కు లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఇప్పటికే మర్కజ్‌ వెళ్లినవారిని, తరువాత దేవ్‌బంద్‌కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానాతిప్పలు పడ్డ పోలీసులు.. ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు. 

అందుకే వెళ్లారా..? 
ఢిల్లీలో జరిగే తబ్లిగీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు. ఈ ప్రార్థనలకు హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళ్తుంటారు. మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు. రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు. అయితే, తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హరియాణాలోని మేవాట్‌లో జరిగిన జమాత్‌లో పాల్గొన్నారని సమాచారం. రోహింగ్యాలు వలస జీవులు. చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. రంజాన్‌ సమీపిస్తోన్న నేపథ్యంలో మేవాట్‌కు వచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీరంతా వెళ్లి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరు మేవాట్‌తోపాటు, నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేవాట్‌కు నిజాముద్దీన్‌కు మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా వీరు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది.

దక్షిణాదిన తెలంగాణలోనే అధికం
మనదేశంలో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం, బెంగాల్, ఢిల్లీ, కశ్మీర్, దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు. వీరిని గుర్తించడం సులువే. కానీ, చాలామంది పాతబస్తీ, బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పటివరకు అందిన సమా చారం మేరకు నల్లగొండలో 14 మంది, హైదరాబాద్‌ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది. అందులో కూడా ఎవరైనా మిస్సయ్యారా? అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు