ఒకే చోట.. నేరస్తుల డేటా 

24 Dec, 2018 02:19 IST|Sakshi

క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లోకి కేంద్ర దర్యాప్తు బృందాలు

ఎన్‌ఐఏ, సీబీఐతోపాటు ఫారెస్ట్, ఎక్సైజ్, ఇతర విభాగాలు సైతం

ఇక ప్రతీక్షణం నేరస్తుల డేటా అప్‌లోడ్‌

దేశవ్యాప్తంగా నేర సమాచార మార్పిడి సులభం  

సాక్షి, హైదరాబాద్‌: క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌)లో ఇక కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా భాగం కానున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ)తోపాటు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసే అధికారం ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు తమ వద్ద ఉన్న నేరస్తుల సమాచారాన్ని సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపర్చనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ.. ఎవరు.. ఏ నేరం చేసినా.. వాటి వివరాలు, ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్‌ఎస్‌లో అందుబాటులో ఉండనున్నాయి. నేర సమాచారాన్ని ఒకే వ్యవస్థ కింద మార్పిడి చేసుకునేలా సీసీటీఎన్‌ఎస్‌ వేదికను ఈ–గవర్నెన్స్‌ ద్వారా 2009లో కేంద్రం రూపొందించింది. ఇప్పటివరకు సీసీటీఎన్‌ఎస్‌లో రాష్ట్రాల పోలీస్‌ శాఖలు మాత్రమే స్టేక్‌ హోల్డర్లుగా ఉంటూ వచ్చాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు సంస్థలను కూడా సీసీటీఎన్‌ఎస్‌లో డేటా అప్‌లోడ్‌ చేసేలా ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంతో నేరస్తుల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. 

సమస్తం.. సీసీటీఎన్‌ఎస్‌లోకి.. 
సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు కేసులు, నేరస్తుల సమస్త సమాచారాన్ని సీసీటీఎన్‌ఎస్‌లోకి అప్‌లోడ్‌ చేయనున్నాయి. అలాగే రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫారెస్ట్‌ విభాగం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లాంటి ప్రత్యేక యూనిట్లు సైతం కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌ డ్యాష్‌బోర్డులో పొందుపర్చాల్సి ఉంటుంది. సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టు తీర్పులు, కోర్టు కొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్‌తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్‌లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు అమలులో తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్‌ఐఆర్, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తలు