కేంద్ర మంత్రుల రాకపై అయోమయం

3 Feb, 2018 02:46 IST|Sakshi

మేడారం జాతరపై ఉత్సాహం చూపిన కేంద్ర గిరిజన శాఖ హెలికాప్టర్‌ పంపితే వస్తామని కబురు 

చాపర్‌ పంపే అంశంపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: మేడారానికి కేంద్ర మంత్రుల రాకపై అయోమయం నెలకొంది. జాతర శనివారంతో ముగియనున్నా.. మంత్రుల రాకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి పర్యటన కొలిక్కి రాలేదు. మేడారం జాతరకు జాతీయహోదా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గిరిజన శాఖ ఇదివరకే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా జాతరకు రావాల్సిందిగా కేంద్ర గిరిజన శాఖను ఆహ్వానించింది. ఈ క్రమంలో జాతరపై ఉత్సాహం చూపిన కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రత్యేక హెలికాప్టర్‌ ఏర్పాటు చేస్తే మంత్రుల బృందంతో హాజరవుతామని చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వస్తే.. హైదరాబాద్‌ నుంచి జాతర జరిగే చోటుకు హెలికాప్టర్‌ ద్వారా వారిని చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి. 

ప్రొటోకాల్‌ ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వాస్తవానికి శుక్రవారమే కేంద్ర మంత్రులు బృందం రావాల్సి ఉంది. కానీ జాతరకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేదు. హెలికాప్టర్‌ పంపాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మేరకు కేంద్ర గిరిజన శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ రాష్ట్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మేడారంలో వీఐపీల కోసం మూడు హెలిపాడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌ మేడారం వెళ్లారు. భక్తులూ భారీ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర మంత్రుల పర్యటన కుదరదని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు