కుకునూరుపల్లి పీహెచ్‌సీలో కేంద్ర బృందం

7 Aug, 2018 10:15 IST|Sakshi
ఆసుపత్రి పరిసరాలలో కలియతిరుగుతున్న కేంద్ర బృందం సభ్యులు 

కొండపాక(గజ్వేల్‌): మండల పరిధిలోని కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఆరోగ్య కేంద్రం పనితీరులో మంచి ఫలితాలను పొందడంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, కాన్పుల సంఖ్య, మౌలిక వసతులు, రోజుకు వచ్చిపోయే రోగుల సంఖ్య, తదితర అంశాలను రెండు రోజుల పాటు కేంద్ర బృందం పరిశీలిస్తుంది.

ఈ క్రమంలో సోమవారం మొదటి రోజున ఆసుపత్రి ఆవరణలో కలియతిరుగుతూ పరిసరాలను చూశారు. ఆసుపత్రికి ఎలాంటి వైద్యం కోసం ప్రజలు వస్తున్నారో స్వయంగా పరిశీలించారు. దీంతో పాటు వైద్య పరీక్షలు పొందిన వారిని వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిష్టరు, సమయ పాలన, రోగులతో సిబ్బంది ప్రవర్తన స్వయంగా పరిశీలించారు.

ఆసుపత్రిలో డెలివరీ గదిని, ల్యాబ్‌ పరికరాలను, ఇన్‌ పేషంట్లకు ఏర్పాటు చేసే గదులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే గ్రామాల స్థితిగతులు, ప్రజల జీవన ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మీనాక్షి, సుందరంలు మాట్లాడుతూ ఆసుపత్రిలో తిరిగి గుర్తించిన విషయాలను కేంద్ర ప్రభుత్వంకు నివేదిస్తామన్నారు.

ప్రస్తుతం ఆసుపత్రి పనితీరు బాగానే ఉందని ప్రాథమికంగా కితాబిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు అనిల్, కుమార్‌ రాష్ట్ర క్వాలిటీ బృందం ధరంసింగ్, జిల్లా సభ్యులు అవోక్, డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ బలరాం, వైద్యులు కృష్ణారావు, పవన్, సిబ్బంది లింగమూర్తి, నర్సింహారెడ్డి, అండాలు, శ్రీనివాస్‌రెడ్డి, సుమిత్ర, లలిత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు