ఔషధ నిల్వ అత్యంత దారుణం

11 Mar, 2019 04:19 IST|Sakshi

నాంపల్లి యూపీహెచ్‌సీలో ‘వ్యాక్సిన్‌’ ఘటనపై కేంద్ర బృందం

గత జూన్‌ నుంచి మందుల నిర్వహణ సరిగ్గా లేదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఔషధ నిల్వ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని కేంద్ర బృందం స్పష్టం చేసింది. శిశువులకు వ్యాక్సిన్ల అనంతరం పారాసిటమాల్‌ బదులు ట్రెమడాల్‌ మాత్రలు ఇవ్వడంతో ఇద్దరు మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర బృందం.. రెండ్రోజులు హైదరాబాద్‌లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి ఆదివారం ప్రాథమిక నివేదిక అందజేసింది. ఆ నివేదిక ప్రకారం నాంపల్లి ఆస్పత్రిలో 2018 జూన్‌ నుంచి ఔషధ నిల్వలను సరిగ్గా నిర్వహించడంలేదని తెలిపింది.

స్టాక్‌ రిజిస్టర్‌ సరిగ్గా లేదని, ఔషధాల ఇండెంట్‌ ప్రక్రియా సక్రమంగా లేదని పేర్కొంది. మెడికల్‌ ఆఫీసర్, ఫార్మసిస్ట్‌లు స్టాక్‌ రిజిస్టర్లను సరిగ్గా పర్యవేక్షించడంలేదని వెల్లడించింది. ట్రెమడాల్‌ వంటి షెడ్యూల్‌ ‘హెచ్‌’ఔషధాల నిల్వ ప్రక్రియ నిబంధనలను ఫార్మసిస్ట్‌ అనుసరించలేదని పేర్కొంది. ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్‌ వంటి విషయాలపై కనీసం శిక్షణ ఇవ్వకుండానే మెడికల్‌ ఆఫీసర్‌ను ఇటీవలే కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని దుయ్యబట్టింది. సంఘటన జరిగిన మార్చి 7న నాంపల్లి యూపీహెచ్‌సీలో 132 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. అందులో 90 మందికి ట్రెమడాల్‌ మాత్రలు ఇచ్చినట్లు నిర్ధారించారు.

అవసరంలేని మాత్రలు ఇచ్చారని గుర్తించారు. అందులో 34 మందిని నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిలోఫర్‌లో ఒకరు, ప్రైవేటు ఆసుపత్రిలో మరొకరు మరణించినట్లు నివేదిక తెలిపింది. గతేడాది హైదరాబాద్‌ డ్రగ్‌ స్టోర్‌లో 2.22 లక్షల ట్రెమడాల్‌ మాత్రలు ఇవ్వగా అందులో ఒక్క నాంపల్లి యూపీహెచ్‌సీకే ఏకంగా 10 వేల మాత్రలు ఇవ్వడంపై కేంద్ర బృందం విస్మయం వ్యక్తంచేసింది. ఈ నెల 9 నాటికి హైదరాబాద్‌ డ్రగ్‌ స్టోర్‌లో 1.97 లక్షల ట్రెమడాల్‌ మాత్రలు అందు బాటులో ఉన్నాయి. యూనివర్సల్‌ జాబితాలోనే ట్రెమడాల్‌ మాత్రలు, ఇంజక్షన్లు ఉన్నాయి. దీనివల్ల ఈ మాత్ర లేదా ఇంజక్షన్‌ను ఉపయోగించడానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయాయి. ఇక రాష్ట్రస్థాయిలో ట్రెమడాల్‌ మాత్రలను వెనక్కి తెప్పించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించినట్లు బృందం నివేదికలో పేర్కొంది.

కేంద్ర బృందం సిఫార్సులు ఇవీ.. 
- పారాసిటమాల్‌ మాత్రలకు బదులు సిరప్‌ను ఆస్పత్రులకు సరఫరా చేయాలి.  
పారాసిటమాల్‌ సిరప్, చుక్కల మందును ఎంత వాడారు? ఎంత వెనక్కి పంపించారన్న అంశాలపైనా రికార్డు ఉండాలి. వాటిని తక్షణమే అమలు చేయాలి.  
ట్రెమడాల్‌ మాత్రలను యూనివర్సల్‌ జాబితా నుంచి తొలగించాలి. వాటి వాడకంపై ఆంక్షలు విధించాలి. నిర్ధారిత ప్రభుత్వ ఆసుపత్రులకే మాత్రలను సరఫరా చేయాలి. ఆ మేరకు డ్రగ్స్‌ సరఫరా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి.

మరిన్ని వార్తలు