కొత్త ఐపీఎస్‌లు వస్తున్నారు!

1 Jun, 2020 14:43 IST|Sakshi

నవంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్న 11 మంది అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కొత్త ఐపీఎస్‌ అధికారులు రాబోతున్నారు. మొత్తం 11 మందిని కేంద్ర హోంశాఖ తెలంగాణకు ఇటీవల కేటాయించింది. వీరు సెప్టెంబర్‌ నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. అక్టోబర్‌ చివరివారం లేదా నవంబర్‌ తొలివారంలో వీరంతా బాధ్యతలు స్వీకరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణకు ఈ ఏడాది 11 మంది ఐపీఎస్‌ అధికారుల కొరత ఏర్పడనుంది. వాస్తవానికి ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మొత్తంగా 40 మంది ఐపీఎస్‌ అధికారులు కావాలని కేంద్రాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఈ నెలలోనే బదిలీలు, పదోన్నతులు: జూన్‌లో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌లు రిటైర్‌ కానుండటంతో హోంశాఖ ఇప్పటికే బదిలీలు, పదో న్నతులపై కసరత్తు పూర్తి చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఐజీల పదోన్నతుల విషయంలోనూ ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కానీ సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్‌డౌన్‌  నేపథ్యంలో నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలు ముందుకు కదలలేదు. వీరికి కూడా ఇదే నెలలోనే పదోన్నతులు వస్తాయని సమాచారం. 

మరిన్ని వార్తలు