కంటితుడుపే!

4 May, 2017 08:02 IST|Sakshi
కంటితుడుపే!

మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద మిర్చి కొనుగోలుకు కేంద్రం అంగీకారం
- అడిగింది క్వింటాల్‌కు రూ. 7,000
- కేంద్రం అంగీకరించింది రూ. 5,000
- 3.3 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితి
- తక్కువ ధర నిర్ణయించడంపై రాష్ట్రం అసంతృప్తి
- కేంద్ర నిర్ణయాన్ని అంగీకరించాలా? బోనస్‌ ఇవ్వాలా?.. అధికారుల తర్జనభర్జన
- ఈ నెల 2 నుంచి 31 వరకు కొనుగోళ్లు
- రైతుల వద్ద ఇంకా 30 లక్షల టన్నులున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అంచనా


సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు కేంద్రం కంటికి కనిపించడం లేదు. ధర పతనమై గగ్గోలు పెడుతున్న రైతులకు కంటితుడుపు చర్యగా క్వింటాల్‌కు రూ.5 వేల ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం ద్వారా కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి, రైతు సంస్థల నుంచి, కోఆపరేటివ్‌ మార్కెట్ల నుంచి మిర్చిని క్వింటాలుకు రూ.5 వేలు చెల్లించి కొనుగోలు చేస్తాయని చెప్పారు.

తెలంగాణలో 33,700 టన్నులు, ఏపీలో 88,300 టన్నుల మిర్చిని సేకరిస్తారని, ఈ కొనుగోలు ద్వారా నష్టం వచ్చినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 చొప్పున భరిస్తాయని తెలిపారు. ఈ పథకం కింద ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేలు ఇవ్వాలని కోరితే.. కేంద్రం కేవలం రూ.5 వేలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. మిర్చిని రూ.4–5 వేల మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నందునే రూ.7 వేలకు కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి విన్నవించామని, కానీ కేంద్రం కూడా దళారుల మాదిరే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన ధర, పరిమితి వల్ల మళ్లీ మిర్చి మంటలు చెలరేగుతాయని అంటున్నారు.

అమలు చేద్దామా? బోనస్‌ ఇద్దామా?
రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కేవలం 33,700 టన్నుల (3.3 లక్షల క్వింటాళ్లు) మిర్చి మాత్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రం పరిమితి విధించింది. కొనుగోలు పన్ను, గోదాముల చార్జీలు, ప్యాకింగ్‌ మెటీరియల్, లోడింగ్, అన్‌లోడింగ్‌ ఇతరత్రా చార్జీలు కలిపి క్వింటాలుకు రూ.1,250గా నిర్ణయించారు. రైతుల నుంచి ప్రభుత్వ సంస్థల ద్వారా అంటే సహకార సంఘాలు, రైతు సంస్థలే చేయాలి. దళారులను దూరం పెట్టాలి. సేకరించిన మిర్చి నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాలి.

రైతులకు చెల్లింపులను డిజిటల్‌ లేదా నగదు రహిత లావాదేవీల ద్వారానే చేయాలని కేంద్రం సూచించింది. కేంద్రం రూ.5 వేలే ప్రకటించడంపై రాష్ట్ర సర్కారు అసంతృప్తితో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయాలా? లేక తామే క్వింటాలుకు రూ.1500 బోనస్‌ ఇచ్చి రైతులను ఆదుకోవాలా అన్న తర్జనభర్జనలో అధికారులున్నారు.

కొనాల్సింది ఇంకా 30 లక్షల క్వింటాళ్లు
రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 30 లక్షల క్వింటాళ్ల మిర్చిని రైతులు అమ్మేశారు. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉందని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. ధాన్యం, కందులు, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలుకు కేంద్రం 100 శాతం అనుమతి ఇచ్చింది. కానీ మిర్చి కొనుగోలు వద్దకు వచ్చేసరికి మార్కెట్‌కు వచ్చిన వాటిల్లో కేవలం 10 శాతం మాత్రమే అనుమతిచ్చింది. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 3.3 లక్షల క్వింటాళ్లకే అనుమతి ఇచ్చింది. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోజుకు లక్ష క్వింటాళ్లు మార్కెట్‌కు వస్తోంది.

కేంద్రం అనుమతించిన ప్రకారం మూడు రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శీతల గిడ్డంగులు లేని పరిస్థితుల్లో నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది. కానీ కేంద్రం మొత్తం నష్టాన్ని 25 శాతానికి కుదించినందున అందులో సగం మాత్రమే భరించేందుకు ముందుకొచ్చింది. అంటే ఇచ్చిన అనుమతికి అయ్యే ఖర్చు రూ. 212 కోట్లలో కేంద్రం వాటా రూ.26 కోట్లు మాత్రమే. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు. ఇది కూడా కేవలం 3.3 లక్షల క్వింటాళ్లకే. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్లకు మరో రూ.1,800 కోట్లు వర్కింగ్‌ కేపిటల్‌ అవసరం. దీనికి కేంద్రం బాధ్యత లేదంటున్నారు. 30 నుంచి 50 శాతం వరకు నష్టం అనుకున్నా.. రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశముంది. నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదు. కాబట్టి ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు