ఓటరు నమోదుకు నాలుగు రోజులే!

12 Mar, 2019 01:57 IST|Sakshi
లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన సీఈఓ రజత్‌కుమార్‌ 

ఈ నెల 15 వరకు ఓటరుగా పేరు నమోదుకు అవకాశం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈ నెల 15లోగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ తెలిపారు. గడువులోగా పేరు నమోదు చేసుకున్న వారు ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందొచ్చని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుండగా దానికి 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటు హక్కు కల్పిస్తామని వివరించారు. ఆ తరువాత వారంపాటు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే ఈ నెల 25 వరకు కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ నెల 25 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రజత్‌ కుమార్‌ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న ఈవీఎంల పరిశీలనకు, 25న ఓటర్ల జాబితాల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రానికి రానున్నాయన్నారు.

ఎన్నికల కోడ్‌లో భాగంగా బహిరంగ మద్యపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రజత్‌ కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు, వాటిపై తీసుకునే చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతరత్రా వాటిపై ఉన్న ప్రకటనలను తొలగించాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. వెబ్‌సైట్లలోని ప్రభుత్వ ప్రకటనలపై ఐటీశాఖ నుంచి నివేదిక కోరామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సదుపాయాలతోపాటు అత్యవసర వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేస్తామన్నారు. సీఈఓతో జరిగిన భేటీలో కాంగ్రెస్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, బీజేపీ నేత గట్టు రామచంద్రరావు, ఎంఐఎం నేత సయ్యద్‌ ఎహెసాన్‌ జాఫ్రీ, బీఎస్పీ నేతలు పాల్గొన్నారు.

25 వరకు నామినేషన్ల స్వీకరణ... 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ వ్యవధిలో సెలవు రోజులైన హోలీ, ఆదివారం మాత్రం నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కొందరు ఎన్నికల సిబ్బంది ఇంకా విధుల్లో చేరలేదని, వారు వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతపై అన్ని రాష్ట్రాల అధికారులతో సమన్వయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని, సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ఉండేలా ప్రతిపాదించినట్లు రజత్‌ తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును పెట్టుకోరాదని, ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందిపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషితో రజత్‌ కుమార్‌ సోమవారం సమావేశమయ్యారు. అన్ని జిలాల్లో రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారని, అయితే కొన్ని ఏఆర్‌ఓ స్థానాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపాల్సిన ఐఎఎస్‌ అధికారుల జాబితాపైనా చర్చించారు.

బీజేపీ జేబు సంస్థగా ఈసీ: కాంగ్రెస్‌

మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. సీఈఓతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో పశ్చిమ బెంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండటంతో అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టం కానుందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని, అధికార టీఆర్‌ఎస్‌ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారం ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు దృష్టిసారించడం లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తనకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్‌ స్లిప్‌ రాలేదని, ఇది కుట్ర పూరితంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో టీఆర్‌ఎస్, ఎంఐఎం కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు