ఆహార మందిరం

26 Mar, 2018 08:27 IST|Sakshi

చిరుధాన్యాలతో అల్పాహారం  

రామంతాపూర్‌: నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. వీటితో తయారు చేసిన వంటకాలకు డిమాండ్‌ ఉంటోంది. సిటీజనులకు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు చిరుధాన్యాలతో అల్పాహారం అందిస్తున్నారు.రామంతాపూర్‌ శ్రీనివాసపురం బ్రహ్మం గారి దేవాలయం వద్ద ధ్యానప్రకృతి ఆహార మందిరం పేరుతో వీరు ఏర్పాటు చేసిన టిఫిన్‌ సెంటర్‌ స్థానికులకు ఆరోగ్య రుచులు అందిస్తోంది.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన శ్రీకాంత్, తుషార్, శివకృష్ణ దీనిని ప్రారంభించారు. రాగులు, సజ్జలు, కొర్రల పిండి, జొన్న, అరికెలు, సామలు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, దేశీ ఆవు నెయ్యి, సైందవ లవణం, పొట్టు పెసర్లతో... పూరీ, ఇడ్లీ, దోసె, ఉప్మా తదితర టిఫిన్లు అందిస్తూ ఆహా అనిపిస్తున్నారు. రాగులు, కొర్రలతో ఇడ్లీలు, దోసెలు, వీటికి తృణధాన్యాలు కలిపి మరికొన్ని రకాల టిఫిన్లు, రాగి పిండితో పూరీ, అంబలి, జావా తదితర పదార్థాలను వండి వడ్డిస్తున్నారు.సాధారణ టిఫిన్ల మాదిరే చిరుధాన్యాలతో తయారు చేస్తూ రూ.30కేఅందించడం విశేషం.   
 
వడ్డింపులోప్రత్యేకత..  
వీరు తయారు చేసిన టిఫిన్లను అరిటాకుల్లో వడ్డిస్తున్నారు. అంతేకాకుండా తాగేందుకు తులసీ ఆకులు కలిపిన నీటిని అందిస్తున్నారు. ఆర్డర్‌ ఇస్తే డోర్‌ డెలివరీ సైతం చేస్తున్నారు. కిట్టీ పార్టీలు, చిన్నపాటి శుభకార్యాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు తెలిపారు.

 రుచి.. నాణ్యత
నెల రోజులుగా ఇక్కడే టిఫిన్‌ చేస్తున్నాను. టిఫిన్లు రుచిగా, నాణ్యతగా ఉన్నాయి. తృణధాన్యాలు నేరుగా తినలేని వారు ఈ టిఫిన్లు తీసుకోవచ్చు.      – రఘు, శ్రీనివాసపురం

 ఆదరణ బాగుంది..
వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టిఫిన్లు తినేందుకు అందరూ అలవాటు పడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.      – తుషార్, నిర్వాహకుడు

మరిన్ని వార్తలు