16 దారుల్లో..ప్రగతి చక్రం!

10 Jan, 2020 02:27 IST|Sakshi

సగటున 9 శాతం ఆర్థిక వృద్ధి నమోదు

ఇప్పటివరకు 300 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు

ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లు దాటాయి..

పాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు..

రాష్ట్ర అభివృద్ధిపై సెస్‌ నివేదిక విడుదల

1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్టులు

కొన్ని పథకాల అమల్లో లోటుపాట్లు సర్దుబాటు చేసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి పదహారు అంశాల ప్రాతిపదికన జరుగుతోందని, ప్రగతి చక్రం పయనిస్తున్న తీరు కూడా మంచి ఫలితాలే ఇస్తోందని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) వెల్లడించింది. వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి ఫలితాలపై సెస్‌ ఇటీవలే ‘తెలంగాణ డెవలప్‌మెంట్‌ సిరీస్‌’పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల తదితర రంగాల పనితీరు, ఫలితాలను విశ్లేషించింది. అలాగే కొన్ని పథకాల అమల్లో జరుగుతున్న లోటు పాట్లను కూడా సవరించాలని సూచించింది. ఈ నివేదికపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి.. ప్రణాళిక, గణాంక, తదితర శాఖల అధికారులతో చర్చించారు. సెస్‌ తయారు చేసిన ఈ నివేదిక ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు.

నివేదికలోని ముఖ్యాంశాలివీ.. 
►రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర స్థూల అభివృద్ధి (జీఎస్‌డీపీ)లో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం. ఏటా అభివృద్ధి సగటున 9 శాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే స్థూల అభివృద్ధిలో వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఈ అభివృద్ధి బాగా కనిపిస్తుండగా, జనగామ, సిరిసిల్ల, కుమ్రం భీం, వనపర్తి వెనుకబడ్డాయి. 
►రాష్ట్రం దీర్ఘకాలంగా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడి ఉండటంతో అప్పుల రూపం లో నిధులు తెచ్చి ఆస్తుల కల్పనకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర నికర అప్పు రూ.1.41 కోట్లుగా ఉంది. ఆర్థిక చట్టాల నిబంధనలకు అనుగుణంగా వడ్డీలు చెల్లిస్తున్నారు. 
►సాగునీటి రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని 46,531 చెరువుల్లో 60 శాతం చెరువులను రూ.2,500 కోట్లకు పైగా వెచ్చించి మిషన్‌ కాకతీయలో భాగంగా పునరుద్ధరించారు. తద్వారా మొత్తం 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.  
►వ్యవసాయ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ లాంటి వాటితో రైతుల ఆదాయం పెరగాల్సి ఉంది.  
►గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రాన్ని మాంసం ఉత్పత్తి హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాంసం ఎగుమతి చేసే స్థాయికి వెళ్లడంతో పాటు రూ.25 వేల కోట్ల మార్కెట్‌ సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. 
►చేపపిల్లల పెంపకం ద్వారా చేపల ఉత్పత్తి 3.2 లక్షల టన్నులకు చేరింది. చేపల ఉత్పత్తిలో కేరళను చేరుకోగలిగాం. ఇప్పటివరకు గుర్తించిన 4,530 చెరువుల్లో 50 కోట్ల వరకు చేపపిల్లలను వదిలారు.  
►రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌ తరహాలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉద్యానపంటలు, చేపల పెంపకం వైపు రైతులను మళ్లించాలి.

తెలంగాణ డెవలప్‌మెంట్‌  సిరీస్‌లోని 16 అంశాలివే..
1) ఆర్థికాభివృద్ధి, 2) ఆర్థిక నిర్వహణ, వనరుల సమీకరణ, 3) వ్యవసాయ రంగం, 4) నీటిపారుదల, 5) పశుసంపద, మత్స్య సంపద, 6) భూ అంశాలు, 7) పారిశ్రామిక రంగం, 8) సేవారంగం, 9) నైపుణ్యాభివృద్ధి, 10) సామాజిక రంగాలు, 11) సామాజిక భద్రత, 12) సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలు, 13) పట్టణ ప్రాంతాలు,14) పంచాయతీరాజ్‌ సంస్థలు, 15) పాలనా వికేంద్రీకరణ, 16) మహిళా, శిశు సంక్షేమం.

మరిన్ని వార్తలు