‘జోనల్‌ విధానంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’

5 Jul, 2017 19:25 IST|Sakshi
‘జోనల్‌ విధానంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’

హైదరాబాద్‌: తెలంగాణలో జోనల్‌ వ్యవస్థ విధి విధానాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్‌లుగా నిర్ధారించిందని, దీంతో నిరుద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయన్నారు. ఈ మేరకు చాడ బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు.

జిల్లాల పునర్విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనే  జోనల్‌ వ్యవస్థ అమలుపై సందేహాలు వ్యక్తం చేశామని, ఎలాంటి పరిణామాలకు ఇది దారి తీస్తుందో కూడా వివరించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగ యవతకు జరుగుతున్న వివక్ష, అన్యాయాలపై రాజకీయ పోరాటాలు జరిగిన కారణంగానే పార్లమెంటులో 371-డి సవరణల ద్వారా తెలంగాణను 5, 6 జోన్లుగా విభజించారని పేర్కొన్నారు. పూర్వాపరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జోనల్‌ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. ఇంకా ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలని ఆ లేఖలో కోరారు.

మరిన్ని వార్తలు