కొత్త కలెక్టరేట్ల నిర్మాణం.. కమీషన్ల కోసమే

14 Oct, 2017 16:16 IST|Sakshi

రాజేంద్రనగర్‌/మణికొండ: ఉద్యోగస్తులను నియమించకుండానే  ప్రభుత్వం కమీషన్ల కోసం కలెక్టరేట్‌ భవనాలను నిర్మిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి పోరుబాట యాత్ర గురువారం రాజేంద్రనగర్‌లోని అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చౌరస్తా, మంచిరేవులలో సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత ఎన్నికల ముందు జీహెచ్‌ఎంసీలో లక్ష ఇళ్లు కట్టిస్తామని తెలిపిన ప్రభుత్వం సంవత్సరంన్నర అవుతున్నా ఒక్క ఇంటినీ నిర్మించి అందించలేదని వెంకట్‌రెడ్డి అన్నారు. నగరాన్ని డంపింగ్‌ యార్డుగా మార్చిందని ఆరోపించారు. ఎక్కడ చూసినా ప్రజల నివాసాల మధ్యనే డంపింగ్‌ యార్డులు కనిపిస్తున్నాయన్నారు. వరద వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇళ్లల్లోకి వస్తుందన్నారు. చెరువుల్లో ఇళ్లు నిర్మించిన వారిని విడిచిపెట్టి నాలాల పక్కన నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, నిర్మాణాలను ప్రభుత్వం కూల్చి వేస్తుందన్నారు. కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌ పరివార్‌ల కనుసన్నుల్లో పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభు త్వం మతోన్మాదాన్ని ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి నర్సింగ్‌రావు, నాయకులు బాలమల్లేష్, పద్మ, యూసుఫ్, సృజన, పాండురంగాచారి, రాము లు యాదవ్, హరినాథ్, భూపాల్‌రెడ్డి, రామేశ్వర్‌రావు, రాజ్‌కుమార్, కృష్ణాగౌడ్, సాయిలు, అంజయ్య, లక్ష్మీనారాయణ,నర్సింహ, శ్రావణి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు