పిట్టలగూడేనికి తరలిన యంత్రాంగం

10 Aug, 2018 13:05 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ ఎర్రొళ్ల శ్రీనివాస్‌ 

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఆగ్రహంతో కదిలిన కలెక్టర్, అధికారులు

గూడెంవాసుల సమస్యలు  అడిగి తెలుసుకున్న చైర్మన్‌ శ్రీనివాస్‌

పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం

రఘునాథపల్లి : ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ అంటే అంత చులకనా..? చైర్మన్‌ వచ్చినా పట్టించుకోరా.. అధికారులు ఎక్కడ..? చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా అంటూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎర్రొళ్ల శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. మండలంలోని భాంజీపేట శివారు పిట్టలగూడెంలో చైర్మన్‌ నిద్రిస్తున్నారని తెలిసి గురువారం తెల్లారేసరికి ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. అధికారులతో కలిసి చైర్మన్‌ పిట్టలగూడెం వాసుల పరిస్థితిని పరిశీలించారు.

దాదాపు 78 కుటుంబాలు గుడిసెల్లో నివసించడం, మరుగుదొడ్లు,  కనీసం విద్యుత్‌ సరఫరా కూడ లేక పోవడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పిట్టలగూడెం వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వారి సమస్యలు అధికారుల సమావేశంలో చైర్మన్‌ వివరించగా కలెక్టర్‌ నోట్‌ చేసుకున్నారు. చైర్మన్‌  మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ కేంద్రం మంజూరైనా ప్రారంభంకాకపోవడం, ఉపాధి పథకం అమలు కావడం లేదని, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డు, ఆసరా పింఛన్లు, సీసీ రోడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి ఒక్క పెళ్లి మాత్రమే చేసుకోవాలని, ఇద్దరు పిల్లలే ముద్దు అని, మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని,  దైవభక్తి ఉండడంలో తప్పు లేదని, బలుల పేరుతో డబ్బులు వృథా చేయకుండా ఉన్నంతలో పండుగలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గూడెంవాసులకు సూచించారు. స్థానికుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్‌  ఆదేశించారు. 

వారంలోపే సమస్యలు పరిష్కరిస్తాం

ఏనెబావి, భాంజీపేట శివారు పిట్టలగూడెంలలో స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. భాంజీపేట పిట్టలగూడెంలో పదో తరగతి చదివిన మహిళలు లేనందున , ఏడో తరగతి చదివిన వారికి మినీ అంగన్‌వాడి టీచర్‌గా అవకాశం కల్పిస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సీసీ రోడ్లు, వేయిస్తామని, అందుబాటులో ఉన్న స్థలంలో 78 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారు. మిషన్‌ భగీరథలో ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తామని, అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాలు అందజేస్తామని, పాడి గేదెలు, ఆధార్, రేషన్‌ కార్డులు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

లేఅవుట్, కమ్యునిటి భవనం కోసం రూ 10 లక్షలు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరుకు ముందే ప్రభుత్వ స్థలంలో లేఔట్‌ చేసేందుకు అవసరమయ్యే రోడ్లకు రూ.5 లక్షలు, కమ్యునిటి భవన నిర్మాణానికి రూ.5 లక్షలు తన నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ప్రభుత్వ భూములను మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్‌ మాట్లాడుతూ తాను దత్తత తీసుకున్న పిట్టలగూడెం గ్రామానికి కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేశామన్నారు.

గూడెంలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి బంగారు కేసీఆర్‌ నగర్‌గా రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. కమిషన్‌ సభ్యుడు రాంబల్‌నాయక్, బుడిగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లికా ర్జున్, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి గట్టుమల్లు, తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ సరిత, ఈఓపీఆర్డీ గంగాభవాని, డాక్టర్‌ సుగుణాకర్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ ఉప సర్పంచ్‌ రాంచందర్, నాయకులు మారుజోడు రాంబాబు, రవి, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు