పోలీసులు వేధిస్తున్నారు

26 Nov, 2019 04:19 IST|Sakshi

హైకోర్టును ఆశ్రయించిన చైతన్య మహిళా సంఘం

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు తమను అకారణంగా వేధింపులకు గురిచేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వ్యక్తిగత వివరాలను నిర్దిష్ట ఫారం ద్వారా తెలపాలని ఒత్తిడి చేస్తున్నారంటూ చైతన్య మహిళా సంఘం కార్యదర్శులు ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. డి.దేవేంద్ర, ఎం.స్వప్న, ఆత్మకూరు అన్నపూర్ణ సంయుక్తంగా దాఖలు చేసిన రిట్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ ఐజీ, హైదరాబాద్‌/రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, రాచకొండ, కుషాయిగూడ, ఉప్పల్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ప్రతివాదులు గా చేశారు. మహిళా హక్కుల కోసం తమ సంఘం 1995 నుంచి ఉద్యమిస్తోందని, మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ పద్ధతుల్లో ఉద్యమిస్తున్నామని దేవేంద్ర రిట్‌లో వివరించారు.

ఈ నెల 22, 23 తేదీల్లో పోలీసులు మేడిపల్లిలోని తన ఇంటికి వచ్చి తనను పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారని, కారణాలు చెప్పాలని తాను కోరితే రెండో రోజు తాను లేని సమయంతో తన తండ్రి సోమయ్యను దౌర్జన్యంగా తీసుకువెళ్లి నేలపై కూర్చోబెట్టారని తెలిపారు. తన తండ్రితో ఫోన్‌ చేయిస్తే తాను పోలీస్‌ స్టేషన్‌కు వెళితే 33 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అందజేశారని, అందులో వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయాలని కోరారని చెప్పారు. స్వప్న, అన్నపూర్ణలను కూడా పోలీస్‌ స్టేషన్‌ కు రావాలని వారి ఇళ్లకు వచ్చి పోలీసులు ఒత్తిడి చేశారని చెప్పారు. కారణం లేకుండా ఎందుకు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారో చెప్పకుండా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. పోలీసుల జోక్యం చేసుకోకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని రిట్‌లో కోరారు.

మరిన్ని వార్తలు