చాలెంజ్‌ ఓటు ఉందిగా..!

21 Mar, 2019 06:51 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పోలింగ్‌ ప్రక్రియలో చాలెంజ్‌ ఓటు అని ఒకటి ఉంది. ఓటరు జాబితాలో పేరుండి.. పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లిన తర్వాత ఆ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే సదరు ఓటరు వెనుదిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఓటును చాలెంజ్‌ చేయవచ్చు. మొదటగా ఓటరు గుర్తింపును చాలెంజ్‌ చేసి ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, వయసు తదితర వివరాలు సరిచూడాలి. ఇలా ఒక్కో అంశాన్ని చాలెంజ్‌ చేయవచ్చు. ప్రతి చాలెంజ్‌కు రూ.2 చెల్లించాలి. అధికారులు ప్రతి చాలెంజ్‌ను వరుస క్రమం పరిశీలిస్తారు. సదరు ఓటరు అన్ని ఆధారాలు చూపితే చాలెంజ్‌లో నెగ్గినట్లుగా భావించి ఓటు వేయడానికి అనుమతిస్తారు. చాలెంజ్‌ ఓటర్ల ఫాంలో ఓటరు వివరాలు నమోదు చేసి సంతకం తీసుకుంటారు.  చాలెంజ్‌ చేసిన వ్యక్తి సరైన ఆధారాలతో రుజువు చేసుకోలేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఓటర్లను ప్రలోభపెడితే ఐదేళ్ల జైలు
ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా కులం, ధనం, బహుమానాల పేరుతో రాజకీయ పార్టీలు ప్రలోభపెడుతుంటాయి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలని బెదిరించడం, బలవంతంగా ఓటు వేయించడం, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు చెందిన ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని పేర్కొంది. ఓటర్లను ప్రలోభానికి చేస్తే గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పదు. 

>
మరిన్ని వార్తలు