చండీయాగం పరిసమాప్తం

26 Jan, 2019 01:47 IST|Sakshi

విశాఖ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో పూర్ణాహుతి

పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు, కుటుంబ సభ్యులు

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: బంగారు తెలంగాణ కల సాకా రం కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజులపాటు చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పరిసమాప్తమైంది. యాగం చివరి రోజైన శుక్రవారం ఎనిమిది మండపాల్లో పూర్ణాహుతితో ఈ మహా క్రతువు పూర్తయింది. విశాఖ పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతోపాటు కుటుంబ సభ్యులు ప్రతి మండపానికీ వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, రుగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణవేద మండపాల్లో పూర్ణాహుతి తర్వాత ప్రధాన యాగశాల చండీమాత మహామండపంలో పూర్ణాహుతి చేపట్టారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ క్రతువుతో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. 

రాజశ్యామలదేవికి పూజలు... 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు శుక్రవారం ఉదయం ముందుగా రాజశ్యామలదేవి మండపంలో పూజలు నిర్వహించారు. సమస్తత్వమే రాజశ్యామల మాతాకీ జై అంటూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిగాయి. బగలాముఖిదేవి మండపంలో జరిగిన పూజల్లో వేద పండితులు ‘జయ పీతాంబర ధారిణి, దివ్య వేదోక్త మహానీరాజనం సమర్పయామి’అంటూ పూజలు చేశారు. నవగ్రహ మండపంలో నవగ్రహ, మహారుద్ర, చతుర్వేద మండపాల్లో సైతం పూర్ణాహుతి జరిగింది. ‘సహస్ర శీర్షా, పురుష సంవేద పుష్పమాం, పుష్పమాలికాం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్య సమర్పయామి’అంటూ పూర్ణాహుతి నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దాశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్టాన దేవత మండపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోఢశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం చతుశష్టి యోగి నిబలి మంగళ నీరాజన సేవ చేశారు.

ఆ తర్వాత అగ్ని మదనం ద్వారా అగ్ని ప్రతిష్ట చేసి 10 కుండాల వద్ద అదే అగ్నితో హోమం ప్రారంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞ కుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి 11 మంది వేదపండితులు పాయసం, తెల్ల నువ్వులు, నెయ్యితో కలిపిస ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు. అనంతరం అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను చేపట్టారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్ల నువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞ భగవానునికి హావిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మండపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకొచ్చి మహాపూర్ణాహుతి ప్రారంభించారు.

యజ్ఞ ఆచార్యులు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చ కర్పూరం, గంధక చూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయ తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞ భగవానుడికి సమర్పించారు. తర్వాత వసోర్దార... అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞ భగవానుడికి సమర్పించే ప్రక్రియ సాగింది. అదే విధంగా మహారుద్ర, రాజశ్యామల, బగలాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మండపాల్లో కూడా షోఢశోపచార పూజలు చేసి హోమాల అనంతరం పూర్ణాహుతితోపాటు సువాసిని పూజ, మహదాశీర్వచనం, రుత్విక్‌ సన్మానం నిర్వహించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు... 
చివరి రోజు కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్‌ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ  ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

వెయ్యి కిలోల పాయసం..
యాగంలో చివరి రోజు శుక్రవారం చండీమాత యాగశాలలో అగ్నిస్థాపన చేసి (మిగిలిన నాలుగు రోజులు కేవలం పారాయణం, జపం మాత్రమే చేశారు) హోమాన్ని నిర్వహించారు. చండీ సప్తశతి(700)లోని ప్రతి శ్లోకానికీ (ప్రతి శ్లోకం జుహుయాత్‌ పాయసం, తిల సర్పిషా) నువ్వులు, నెయ్యితోపాటు పాయసాన్ని కలిపి ఆహుతులు ఇచ్చారు. ఇందుకోసం సుమారు వెయ్యి కిలోల పాయస ద్రవ్యాన్ని వినియోగించారు. ఈ పాయసాన్ని బియ్యం, నెయ్యి, పాలు, బెల్లం, తేనె, యాలుకలు, జీడిపప్పు, కిస్మిస్‌ తదితరాలతో తయారు చేశారు. 

సప్తశతి పఠనంతో చండీమాత సాక్షాత్కారం 
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర  
‘కలే చండీ విశిష్యత్‌’కలియుగంలో త్వరగా ఫలితాన్నిచ్చేది చండీ దేవత. ఆమెను ఉపాసించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఐదు రోజులుగా జరుగుతున్న సహస్ర చండీయాగం శుక్రవారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడారు. ఎక్కడైతే సప్తశతి పఠించబడుతుందో అక్కడ నేనుంటానని అమ్మవారు చెప్పారన్నారు. కేవలం ఉండటమే కాకుండా ‘సదామత ద్విమోక్షామి’అంటే.. ‘ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టను’అని చెప్పారని, ఆమె ఎక్కడుంటే అది మణి ద్వీపము, సుభిక్షము, సస్యశ్యామలమూ అయి ఉంటుందన్నారు. అందువల్ల చండీ ఉపాసన ప్రాశస్త్యమై ఉన్నదని అన్నారు.

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు చండీ సంబంధమైన అన్నిరకాల ఉపాసనలు చేశారు. దేశ క్షేమము, లోక సంరక్షణమే ప్రధాన ధ్యేయంగా సంకల్పించి రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, చతుర్వేద, మహారుద్ర సహిత సహస్ర చండీమహాయాగాన్ని చేయతలపెట్టి శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వాముల వారి ఆశీస్సులు అందుకుని గత నాలుగు రోజులుగా గణపతి సహస్ర మోదక హోమం, రాజశ్యామలా మహా మంత్రానుష్టానము, లక్ష బగలాముఖి మహామంత్రానుష్టానము, వెయ్యి చండీ పారాయణములు, మహారుద్ర మంత్రముల అనుష్టానములను చేసి దశాంశ హోమ పక్షమును ఆశ్రయించారన్నారు. చివరిరోజైన శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మహాద్భుతంగా అన్ని యాగములకు పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహాయాగ పూర్ణాహుతిని అత్యంత వైభవముగా ముఖ్యమంత్రి దంపతులు నిర్వహించారు’అని ఆయన ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు