చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా

7 Dec, 2019 07:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. అయితే తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును లక్ష్మీపార్వతి కోరారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించ క ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసి తన వాదనలను కూడా వినా లని కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, సీనియర్‌ న్యాయవాది హాజరు నిమిత్తం విచారణను వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి రెండోసారి చేసిన అభ్యర్థన మేరకు మళ్లీ విచారణ వాయిదా పడింది.

మరిన్ని వార్తలు