విద్యుత్ కోతలకు బాబే కారణం

28 Aug, 2014 00:11 IST|Sakshi

 పరిగి: తెలంగాణలో విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని, గత పాలన లో ఇక్కడి వనరులను తరలించుకెళ్లి సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాండూరులో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

 మేని ఫెస్టోలో పేర్కొన్న విధంగా అధికారం చేపట్టిన 11 వారాల్లోనే 43 అంశాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే దళితులకు మూడెకరాల భూమి పథకం ప్రారంభమైంద ని, రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మా ణం పథకం త్వరలో కార్యరూపం దాల్చనుందని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంతంలోని తాగు, సాగునీటి  సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

 నెట్టెం పాడు, బీమా-1, బీమా-2, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి త్వర లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, బాల్‌రాజ్‌లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజున నాలుగున్నర కోట్ల ప్రజల వివరాలు సేకరించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో చవకబారు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తుంటే ఇక్కడి టీడీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

గత ప్రభుత్వం 2009 నుంచి ఇప్పటివరకు పంటనష్ట పరిహారం చెల్లించకుండా జాప్యంచేస్తే తమ ప్రభుత్వం అన్నికలిపి ఒకేసారి చెల్లిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల మహేష్‌రెడ్డి, కొప్పుల నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వెంకటయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు