చంద్రబాబు ఏపీ టీడీపీకే అధ్యక్షుడు

22 Feb, 2015 01:24 IST|Sakshi

టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పార్టీ కమిటీల విభజన
 సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు పార్టీలో సైతం అదేస్థాయికి చేరిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంను జాతీయపార్టీగా మార్చాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో చంద్రబాబు పార్టీ ఏపీ శాఖకు మాత్రమే అధ్యక్షుడిగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధికారిక వెబ్‌సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తెలుగుదేశం.ఓఆర్‌జీ) స్పష్టం చేస్తోంది. పార్టీ వెబ్‌సైట్‌ను ఇటీవలే అప్‌డేట్ చేసిన ఆ పార్టీ ఐటీ విభాగం 2013లో ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర పార్టీ కమిటీని ప్రాంతాల వారీగా విభజించారు.
 
 ఆంధ్రప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడిగా చంద్రబాబు(చిత్తూరు జిల్లా) పేరును స్పష్టంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర పరిధిలోని 13 జిల్లాలకు చెందిన నేతలకు ఉన్న పదవులను వరుసగా కేటాయించారు. తెలంగాణ శాఖకు సంబంధించి అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన ఎల్.రమణ పేరును వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావును చేర్చి మిగతా పదవులకు ఉమ్మడి రాష్ట్ర కమిటీ నుంచి వేరుచేసి పొందుపరిచారు. కాగా, ఎన్నికల ముందు తెలంగాణ శాఖకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో పార్టీ కన్వీనర్‌గా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పదవి ఇప్పుడు లేదు. ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగానే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు